Begin typing your search above and press return to search.

ముచ్చ‌ట‌గా మూడోసారి ఆరుప‌ల‌క‌ల‌తో

By:  Tupaki Desk   |   2 Dec 2015 5:31 AM GMT
ముచ్చ‌ట‌గా మూడోసారి ఆరుప‌ల‌క‌ల‌తో
X
సైడ్‌ కిక్‌ నుంచి క‌మెడియ‌న్‌ గా - క‌మెడియ‌న్ నుంచి హీరోగా, 6 ప్యాక్ హీరోగా రూపాంత‌రం చెందాడు సునీల్‌. అన్ని ఫార్మాట్‌ ల‌లోనూ స‌క్సెస్‌ ని చ‌వి చూశాడు. టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోగా ఎదిగాడు. హీరోగా ఆరంభ‌మే వ‌రుస హిట్లు కొట్టాడు. అందాల రాముడు - పూల రంగ‌డు - మ‌ర్యాద రామ‌న్న లాంటి హిట్ సినిమాలు వ‌చ్చాయి. కానీ ఆ విజ‌యాల్ని చిర‌కాలం నిలుపుకోవ‌డంలో కాసింత త‌డ‌బ‌డ్డాడు. మ‌ధ్య‌లో కొన్ని ప‌రాజ‌యాలొచ్చి బాగా విసిగించాయి.

అయితేనేం చేతిలో ప్రాజెక్టులున్నాయ్‌. ఇప్ప‌టికిప్పుడు దిల్‌ రాజు బ్యాన‌ర్‌ లో కృష్ణాష్ఠ‌మి అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. దాంతో పాటే ర‌క్ష ఫేం వంశీ కృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో ఓ కీల‌క‌మైన ఫైట్‌ ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ పోరాట దృశ్యం మూవీకే హైలైట్‌ గా ఉంటుంద‌ని స‌మాచారం. సునీల్ ఇటీవ‌లి కాలంలో చొక్కా విప్పి చూపించే సంద‌ర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్ప‌ట్లో పూల‌రంగ‌డు మూవీ కోసం మొద‌టిసారి చొక్కా విప్పి ఆరుప‌ల‌క‌ల దేహం చూపించాడు. అత‌డి కొత్త రూపం చూసిన జ‌నాలంతా స్ట‌న్న‌యిపోయారు. సునీల్ ప్ర‌య‌త్నాన్ని కొనియాడారంతా. బాన పొట్ట‌ని క‌రిగించి 6 ప‌ల‌క‌ల‌తో మ‌డ‌త‌లు చూపించి ప‌రేషాన్ చేశాడు.

ఆ త‌ర్వాత మ‌రోసారి మిస్ట‌ర్ పెళ్లికొడుకు కోసం 6ప్యాక్ చూపించి షాకిచ్చాడు. ఈసారి కూడా ముచ్చ‌ట‌గా మూడోసారి 6ప్యాక్ దేహం చూపించేందుకు రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం వైజాగ్‌ లో ఓ యాక్ష‌న్ సీన్ తీస్తున్నారు. త‌న‌ని రౌండ‌ప్ చేసిన రౌడీల ముందు చొక్కా విప్పి ఫోజు కొడ‌తాడుట సునీల్‌. రామ్ ల‌క్ష్మ‌ణ్ మాష్ట‌ర్లు ఈ ఫైట్స్‌ ని కంపోజ్ చేస్తున్నారు.