రిలీజులు సరే.. హిట్టు అందుకుంటాడా?

Wed Feb 14 2018 23:00:01 GMT+0530 (IST)


చెయ్యడానికి చేతిలో సినిమాలున్నా చెప్పుకోవడానికి హిట్ కరువైపోయిన పరిస్థితి యంగ్ హీరో సందీప్ కిషన్ ది. టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్లతో నటించిన హీరోగా పేరొచ్చింది కానీ తీసిన నిర్మాతలకు పైసలు రావడం లేదు. ఛాన్సులు తగ్గిపోయిన టైంలో లక్కీగా చెన్నై లో చెప్పుకోదగ్గ ఆఫర్లు వచ్చాయి. దీంతో కోలీవుడ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.సందీప్ కిషన్ తాజాగా మహేష్ బాబు సిస్టర్ మంజుల దర్శకత్వంలో మనసుకు నచ్చింది సినిమాలో హీరోగా చేశాడు. ఈ సినిమా 16న రిలీజ్ కానుంది. ఈమధ్య కాలంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం.. కేరాఫ్ సూర్య.. ప్రాజెక్ట్ జడ్ వంటి సినిమాలు వరసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతోపాటు మల్టీస్టారర్ మూవీ శమంతమణి ప్రయోగంగా పేరు తెచ్చుకుంది కానీ ఫలితం మాత్రం రాలేదు. దీంతో నవతరం ప్రేమకథగా వస్తున్న మనసుకు నచ్చింది మూవీపైనే సందీప్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

ప్రస్తుతం తమిళంలో నరగాసురన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో నరకాసురుడు పేరుతో రానుంది. ఇందులో సందీప్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడనేది కోలీవుడ్ టాక్. ఈ సినిమా సమ్మర్ కు థియేటర్లకు రానుంది. ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ ఇప్పుడు సందీప్ కు అర్జంటుగా ఓ కమర్సియల్ హిట్ అవసరం. మరి ఈ సినిమాలతో ఏమన్నా హిట్ అందుకుంటాడేమో చూడాలి.