Begin typing your search above and press return to search.

వావ్: సమ్మర్ సగం ఫుల్లయిపోయింది

By:  Tupaki Desk   |   6 Feb 2016 5:30 PM GMT
వావ్: సమ్మర్ సగం ఫుల్లయిపోయింది
X
ఇంకా వేసవి సినిమాలకు రెండు నెలలు టైం ఉంది. కానీ ఇంతలోనే సగం బెర్తులు ఫుల్ అయిపోయాయి. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరైన టైమింగులో రిలీజ్ చేసుకోవడం ముఖ్యం. పెద్ద సినిమాలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది. సినిమా పూర్తయ్యాక తాపీగా డేట్ ఫిక్స్ చేసుకుందామంటే కుదరదు. వేరే వాళ్లు కర్చీఫ్ వేసేస్తారు. ఆ తర్వాత పోటీకి వెళ్తే నింద మోయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకూడదనే ఈ ఏడాది వేసవి సినిమాలు చాలా మందుగానే డేట్లు ఫిక్స్ చేసుకుని సమరానికి సై అంటున్నాయి.

సమ్మర్ తొలి అర్ధభాగంలో రావాల్సిన సినిమాలన్నీ దాదాపుగా ఇప్పుడే డేట్ ఫిక్స్ చేసేసుకున్నాయి. ముందుగా సమ్మర్ సందడికి తెరదీయబోయేది అక్కినేని నాగార్జున - కార్తిలే. వీళ్లిద్దరి కాంబినేషన్లో తమన్నా హీరోయిన్‌‌ గా వంశీ పైడిపల్లి రూపొందించిన ‘ఊపిరి’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రెండు వారాలకు పవన్ కళ్యాణ్ సందడి మొదలవుతుంది. ఏప్రిల్ 8న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రేక్షకుల ముందుకొస్తుందని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పాడు నిర్మాత శరత్ మరార్.

ఆ తర్వాతి వారం అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ థియేటర్లలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే త్రివిక్రమ్ - నితిన్ - సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అ..ఆ’ ఏప్రిల్ 22న విడుదలవుతుంది. ఇక నెలాఖర్లో మహేష్ బాబు సందడి చేస్తాడు. ఏప్రిల్ 29న బ్రహ్మోత్సవం విడుదల తేదీ ఖరారైంది. మొత్తానికి వేసవిలో దాదాపు నెలన్నర రోజులకు ఐదు బడా సినిమాలు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసేసుకున్నాయి. ఇంకొన్ని రోజుల్లోనే మే నెలకు కూడా సినిమాలు బుకింగ్స్ మొదలుపెట్టేయబోతున్నాయి. ఈ వేసవి చాలా హాట్‌గా ఉండబోతోందన్న మాటే!