ఫ్లాప్ హీరోకు బిగ్ రిలీఫ్

Sun Dec 10 2017 16:51:15 GMT+0530 (IST)

సత్యం.. గోదావరి.. మధుమాసం.. రెండు దశాబ్దాల సుమంత్ కెరీర్లో హిట్ అనిపించుకున్న సినిమాలు ఈ మూడు మాత్రమే. వీటికి ముందు.. తర్వాత.. మధ్యలో వచ్చిన సినిమాలేవీ ఆడలేదు. తెలుగులో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో సుమంత్ ఒకడు. అందులోనూ చివరగా సుమంత్ చేసిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’.. ‘నరుడా డోనరుడా’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఈ దెబ్బతో సుమంత్ కెరీర్ ముగిసిపోయినట్లే అన్నారు కూడా. కానీ సుమంత్ మళ్లీ ఇంకో సినిమా చేశాడు. ఆ సినిమా ఇప్పుడతడికి మంచి ఫలితాన్నే అందించేలా కనిపిస్తోంది. ఈ వారాంతంలో విడుదలైన సుమంత్ సినిమా ‘మళ్ళీ రావా’ ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షిస్తోంది.విడుదలకు ముందు ప్రివ్యూలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మళ్ళీ రావా’.. రిలీజ్ తర్వాత కూడా మంచి టాక్ తెచ్చుకుంది. సుమంత్ మార్కెట్ బాగా దెబ్బ తినడం వల్ల ఈ చిత్రాన్ని తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఐతే టాక్ పాజిటివ్ గా ఉండటం.. రివ్యూలు కూడా సానుకూలంగా రావడంతో సినిమా నెమ్మదిగా పుంజుకుంది. ముఖ్యంగా ఎ-క్లాస్ సెంటర్లలో.. మల్టీప్లెక్సుల్లో ‘మళ్ళీ రావా’ వసూళ్లు బాగున్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు 17 వేల డాలర్లే రాబట్టిన ‘మళ్ళీ రావా’.. రెండో రోజు 30 వేల డాలర్లు వసూలు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు బాగానే ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ అయిపోకున్నా.. పెట్టుబడి అయితే రికవర్ చేయడం ఖాయం. సుమంత్ కు ఇది బిగ్ రిలీఫ్ అనే విషయంలో మాత్రం సందేహాలు లేవు.