Begin typing your search above and press return to search.

ట్రైలర్ ఇలా కట్ చేశారేంటబ్బా

By:  Tupaki Desk   |   20 March 2018 2:30 AM GMT
ట్రైలర్ ఇలా కట్ చేశారేంటబ్బా
X

రంగస్థలం మూవీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. అసలే మెగా పవర్ స్టార్ మూవీ.. పైగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ తెరకెక్కించాడు.. టాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్.. జగపతి బాబు- అనసూయ- ప్రకాష్ రాజ్.. ఆది పినిశెట్టి లాంటి తారాగణం.. ఇంత సెటప్ ఉన్నాక సినిమాకి ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది. అయితే.. రంగస్థలం మూవీకి ఇంతకంటే స్పెషల్ గా చెప్పుకోవాల్సిన విషయం ఆ మూవీ మ్యూజిక్.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం.. పాటలు.. ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ప్రతీ పాటను ఓ అద్భుతంగా మలిచేశాడు దేవిశ్రీ. పీరియాడిక్ మూవీకి పర్ఫెక్ట్ సంగీతాన్ని అందించి.. మ్యూజిక్ వరల్డ్ లో తన సత్తా ఏంటో చాటాడు. ఇంతగా జనాలను మెప్పించిన ఆడియో.. థియేట్రికల్ ట్రైలర్ లో ఎక్కడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్ లో.. ఒక్కటంటే ఒక్క పాటను కూడా ఇంక్లూడ్ చేయకపోవడం.. సుక్కు పనితనానికి నిదర్శనంగా చెప్పచ్చు.

కమర్షియల్ మూవీ ఫార్ములాస్ ను మిస్ కాకుండా అన్నీ కలిపి ఓ మాంచి ప్యాకేజ్ ని సుకుమార్ అందించబోతున్నాడని అర్ధమవుతున్నా.. అంతగా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చిన పాటల్లో ఒక్కటి కూడా ట్రైలర్ లో కనిపించకపోవడం వెనక ఏదైనా స్పెషల్ వ్యూహం ఉందా అనుకుంటున్నారు జనాలు. అయితే.. రంగస్థలం పాటల ప్రోమోలను విడుదల చేస్తుండడం మాత్రం ఫ్యాన్స్ కి కొంత ఊరట కలిగించే విషయం.