Begin typing your search above and press return to search.

‘రంగస్థలం’లో ఎన్టీఆర్ చేసి ఉంటే..

By:  Tupaki Desk   |   19 April 2018 5:59 AM GMT
‘రంగస్థలం’లో ఎన్టీఆర్ చేసి ఉంటే..
X
‘రంగస్థలం’ సినిమా అయ్యాక చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నానని ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యానించాడు దర్శకుడు సుకుమార్. సినిమా చూసిన వాళ్ల అభిప్రాయం కూడా ఇదే అని చెప్పాలి. ఐతే చరణ్ తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్ర చేయలేరా అన్న ఆలోచన కూడా రాకుండా పోదు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ పాత్రను ఎలా చేసేవాడు.. అల్లు అర్జున్ అయితే ఈ పాత్రకు సూటయ్యేవాడా అన్న చర్చలు కూడా జనాల్లో నడుస్తున్నాయి. ఎన్టీఆర్ కు మంచి నటుడిగా పేరుండటం.. ‘రంగస్థలం’ కంటే ముందు సుకుమార్ ఎన్టీఆర్ తో సినిమా చేసిన నేపథ్యంలో అతడే ఈ సినిమాలో నటిస్తే చిట్టిబాబు పాత్రను ఎలా పండించేవాడో అన్న ఆలోచన జనాలకు రాకుండా పోలేదు.

ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ కు ఇదే ప్రశ్న సంధిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. చిట్టిబాబు పాత్రను రామ్ చరణ్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరని తాను అనలేదని.. ఐతే సినిమా అయ్యాక అతను తప్ప ఇంకెవరూ ఆ పాత్ర విషయంలో తలపులోకి రాలేదని.. వేరే నటుడైతే ఎలా చేసేవాడు అన్న ఆలోచనే తనకు రాలేదని.. ఇదే నటుడిగా చరణ్ సాధించిన విజయమని సుక్కు చెప్పాడు. ఇక ఎన్టీఆర్ చిట్టిబాబు పాత్ర చేస్తే ఎలా ఉండేదన్న ఆలోచనపై సుక్కు స్పందిస్తూ.. ఒకే సినిమాను ఇద్దరితో వేర్వేరుగా తీసే అవకాశం లేదని.. ఒకరితో ఒక సినిమా.. ఇంకొకరితో మరో సినిమా తీస్తామని.. అలాంటపుడు ఈ పోలికే కరెక్ట్ కాదని సుకుమార్ అన్నాడు. ఇందుకు ఉదాహరణ చెబుతూ.. ఒక పరుగు పందెంలో ఇద్దరు పోటీ పడితే వాళ్ల మధ్య పోలిక పెట్టొచ్చని.. కానీ ఇద్దరు క్రీడాకారులు వేర్వేరు క్రీడల్లో పోటీ పడితే వాళ్ల మధ్య పోలిక ఎలా తేగలమని.. ‘రంగస్థలం’లో ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉండేదన్న ఆలోచన కూడా ఇలాంటిదే అని సుకుమార్ అన్నాడు.