‘జిగేల్ రాణి’కి డబ్బు పంపిన సుకుమార్

Sat Jul 21 2018 11:49:13 GMT+0530 (IST)

రంగస్థలం సినిమా దర్శకుడు సుకుమార్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. కొద్దిరోజులుగా సింగర్ వెంకటలక్ష్మి మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తోంది. రంగస్థలంలో ‘జిగేల్ రాణి’ పాట పాడినందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. తనను తీసుకెళ్లిన బ్రోకర్ మోసం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే..  ప్రసార మాధ్యమాల్లో ఆమె ఆవేదన వైరల్ గా మారడంతో సుకుమార్ స్పందించారు.   తాజాగా  వెంకటలక్ష్మికి లక్ష రూపాయల నగదును పంపించారు.  దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మరోసారి మీడియా ముందుకు వచ్చిన వెంకటలక్ష్మి కన్నీళ్లతో సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పింది.  సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు సుకుమార్ - సంగీత  దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ పాట పాడే అవకాశం ఇచ్చారని.. సుకుమార్ పంపిన లక్ష రూపాయలు తనకు అందాయని ఆమె స్పష్టం చేశారు. వారికెప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.  సినిమాల్లో ప్రతిభ గల తన లాంటి వారిని ఆదరించాలని.. పాడేందుకు అవకాశం ఇవ్వాలని వెంకటలక్ష్మీ కోరారు.

ఇక జిగేల్ రాణి పాట హిట్ తో తనను ముగ్గురు దర్శక నిర్మాతలు సంప్రదించారని.. వారి సినిమాల్లో పాడే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని వెంకట లక్ష్మి తెలిపారు. ఇదంతా సుకుమార్ - దేవీశ్రీ వల్లేనని ఆమె చెప్పుకొచ్చారు.