ఆర్జీవీ - సుక్కూలా ఫ్యాక్టరీలు పెట్టరేం?

Wed Feb 06 2019 11:27:51 GMT+0530 (IST)

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ల వద్ద పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్లకు లైఫ్ ఉండదన్న తీవ్రమైన విమర్శ ఉంది. అసిస్టెంట్లు పైకి రావడం కష్టమేనని రెగ్యులర్ గా వినిపిస్తుంటుంది. అయితే అలా జరగడానికి కారణమేంటి? లోపం ఎక్కడుంది? అన్నది విశ్లేషిస్తే ఒక్కొక్కరూ ఒక్కో విశ్లేషణ చేస్తుంటారు. మన స్టార్ డైరెక్టర్లలో అరడజను మంది వద్ద శిష్యులు దర్శకులు కాలేకపోవడం విస్మయం కలిగించక మానదు. అయితే ఇప్పుడున్న దర్శకుల్లో శిష్యుల కోసం సినిమాలు నిర్మిస్తున్న సుకుమార్ అన్ని రకాలుగా బెస్ట్ అన్న ప్రశంసలు దక్కుతున్నాయి. సుకుమార్ ఇప్పటికే తన శిష్యుడు ప్రతాప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ని నిర్మించాడు. ఇప్పటికిప్పుడు అతడు ఎనిమిది సినిమాలు నిర్మిస్తున్నాడు. వీటిలో అంతా కొత్త దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నాడు. ఇందులో నలుగురు తన శిష్యులే ఉన్నారట. ఓ శిష్యుడు ఇటీవలే సాయిధరమ్ - మైత్రి మూవీస్ లో సినిమా మొదలు పెట్టేశాడు. అంటే శిష్యుల కోసం సినిమాలు తీసే బెస్ట్ దర్శకుడు ఎవరు? అంటే సుకుమార్ పేరును ఖాయం చేయాల్సిందే. గీతా ఆర్ట్స్ - మైత్రి మూవీ మేకర్స్ - నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ - యువి క్రియేషన్స్ వంటి బ్యానర్లతో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాలకు ప్లాన్ చేయడం విశేషం.మన స్టార్ డైరెక్టర్లలో  రాజమౌళి - త్రివిక్రమ్ - కొరటాల శివ - శేఖర్ కమ్ముల - క్రిష్ .. వీళ్లెవరూ శిష్యుల కోసం సినిమాలు నిర్మించరు.. ఛాన్సులివ్వరు.. అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే కాస్త లోతుగా వివరాల్లోకి వెళితే.. ఏ గురువు తన శిష్యుడు పైకి రావొద్దు అనుకోడు. అవకాశాలిస్తారు.. చొరవ - ప్రతిభ ఉంటే! ఎస్.ఎస్.రాజమౌళి ఇదివరకూ తన వద్ద పని చేసిన త్రికోటికి దర్శకుడిగా అవకాశం వచ్చింది. అలాగే తన స్నేహితుడు మహదేవ్ కి ఛాన్సొచ్చేందుకు సాయపడ్డారు. కానీ ఆ ఇద్దరూ నిరూపించుకోవడంలో తడబడ్డారు. ఆ తర్వాత ఇతర అసిస్టెంట్లకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఏళ్ల తరపడి ఆ కొలువులో అలా పని చేయాల్సిందేనని అర్థమవుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ఫూర్తితో ఎందరో దర్శకులయ్యారు. త్రివిక్రమ్ శిష్యుల్లో వెంకీ కుడుముల ఛలో చిత్రంతో విజయం అందుకుని తర్వాత వేరే సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక స్టార్ రైటర్ కం డైరెక్టర్ కొరటాల శివ తన శిష్య బృందంపై అభిమానం కనబరుస్తారు. భరత్ అనే నేను టైమ్ లో వీళ్లంతా పెద్ద స్థాయికి ఎదగాలని ధీవించారు. అయితే సొంతంగా బ్యానర్ ప్రారంభించి సుకుమార్ లా ప్రోత్సహిస్తున్నారా? అంటే సందేహమే. ఇకపోతే శేఖర్ కమ్ముల శిష్యుల్లో నాగ్ అశ్విన్ దర్శకుడిగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం - మహానటి చిత్రాలతో నాగ్ అశ్విన్ చక్కని విజయాలు అందుకున్నారు. స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ .. ఛాన్సులిచ్చారు. అప్పట్లో బంపరాఫర్ అనే చిత్రం తన శిష్యుడు తీసినదే. కానీ సక్సెస్ దక్కలేదు. మెహబూబా తర్వాత తన వద్ద పని చేసే ఎడిటర్ కి ఛాన్స్.. ఇస్తున్నారు. ఆకాష్ పూరిని  పూరి శిష్యుడే డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. అయితే పూరి రెండు దశాబ్ధాలు పైగానే ఇండస్ట్రీలో ఉన్నారు. అంత కాలం తనతో పాటే పని చేసిన ఎందరు అసిస్టెంట్లు డైరెక్టర్లు అయ్యారు? అన్నది కాస్త తరచి చూస్తే ప్రశ్నార్థకమే.

శిష్యులకు దర్శకులుగా అవకాశాలు ఇవ్వడం అన్న ట్రెండ్ ఆర్జీవీ టైమ్ నుంచే ఉంది. రామ్ గోపాల్ వర్మ తన శిష్యుల కోసం ఏకంగా ఫ్యాక్టరీనే పెట్టారు. కృష్ణవంశీ - పూరి వంటి సీనియర్లు ఫ్యాక్టరీలో పని చేసి - అందులో చదువుకున్న విద్యార్థులే. ఆర్జీవీ తాను పెట్టుబడి పెట్టకపోయినా నిర్మాతల్ని వెతికి పెట్టి కనీసం అవకాశాలిచ్చే ప్రయత్నం చేశారు. తనలా సినిమాలు తీసే దర్శకుల్ని ప్రోత్సహిస్తారు. అయితే మన స్టార్ డైరెక్టర్లు అవకాశాలివ్వలేదు అని ఆడిపోసుకోవడం కంటే - శిష్యులే అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రయత్నాలు చేయలేదని విమర్శించాలేమో!!