చిరు పొగడ్త.. సుకుమార్ ఆవేదన

Mon Mar 19 2018 13:59:09 GMT+0530 (IST)

చిరంజీవి పొగిడితే సుకుమార్ ఆనందపడాలి కానీ.. ఆవేదన చెందడం ఏంటి అంటారా? ఇది నిజం అంటున్నాడు సుక్కు. మరి బాధ ఎందుకు అంటే.. చిరంజీవి పొగిడినపుడు తన వెంట ఎవరూ లేనందుకట. ఆ స్థాయిలో తనను పొగిడేశాడట మెగాస్టార్. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొన్ని రోజుల కిందటే చిరు చూశారు. ఆయనకు విపరీతంగా నచ్చేయడం సుకుమార్ ను ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని మరీ చిరు అభినందించాడట. చిరు పొగిడిన తీరుతో తనకు మాటలు రాలేదని.. ఆ ఆనందాన్ని ఎవరితో ఎలా పంచుకోవాలో తెలియలేదని సుకుమార్ చెప్పాడు.అప్పుడు తన పరిస్థితి గురించి వివరిస్తూ సుకుమార్ ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక గోల్ఫ్ ఆటగాడు షాట్ కొడితే పది కిలోమీటర్ల అవతల ఉన్న హోల్ లోకి సరిగ్గా బంతి పడిందని.. కానీ అక్కడ బంతి పడిన విషయం ఎవరికీ తెలియదని.. అక్కడ ప్రేక్షకులే లేరని.. సరిగ్గా తన పరిస్థితి అలాగే తయారైందని సుకుమార్ చెప్పాడు. చిరంజీవి లాంటి వాడు అంతలా తనను పొగిడినపుడు పక్కన ఎవ్వరూ లేకపోవడం బాధ కలిగించిందన్నాడు. తన భార్య అయినా పక్కన ఉంటే బాగుండేదనిపించిందని చెప్పాడు. వెంటనే ఫోన్ చేసి ఎవరికైనా విషయం చెబుదామన్నా చిరు చెప్పినట్లే తాను చెప్పగలనో లేదో అనిపించిందని.. ఒకవేళ చెప్పినా జనాలు నమ్మరేమో అనిపించిందని సుకుమార్ అన్నాడు. ఐతే సుకుమార్ తర్వాత మైక్ అందుకున్న చిరు ‘రంగస్థలం’ గురించి చాలా గొప్పగానే చెప్పాడు.