Begin typing your search above and press return to search.

వెంకీకి కన్నడ సూపర్ స్టార్ పాదాభివందనం

By:  Tupaki Desk   |   8 Feb 2016 9:13 AM GMT
వెంకీకి కన్నడ సూపర్ స్టార్ పాదాభివందనం
X
‘ఈగ’ సుదీప్.. కన్నడలో సూపర్ స్టార్. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మాంచి పేరు సంపాదించి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుదీప్. తెలుగు - తమిళ - హిందీ భాషల్లోనూ నటించి ఇక్కడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు సుదీప్. అంత స్థాయి ఉన్న నటుడు మన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు పాదాభివందనం చేయడం ఆశ్చర్యపరిచే విషయమే. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో భాగంగా తెలుగు వారియర్స్-కర్ణాటక బుల్డోజర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ చిత్రం చోటు చేసుకుంది.

తెలుగు వారియర్స్ కు హానరరీ కెప్టెన్ అయిన వెంకీ.. మ్యాచ్ పూర్తయిన అనంతరం మైదానంలోకి వస్తూ విజయం సాధించినందుకు సుదీప్ కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అతనేమో వంగి వెంకీ పాదాన్ని తాకి ఆశీర్వచనం తీసుకున్నాడు. వెంకీ వారించి అతణ్ని పైకి లేపాడు. స్టేడియంలో మొత్తం ఇది చూసి ఆశ్చర్యానికి గురైంది. ఈ మ్యాచ్ లో కర్ణాటక జట్టు 5 పరుగుల స్వల్ప తేడాతో తెలుగు టీంను ఓడించింది. అయినప్పటికీ కర్ణాటకతో పాటుగా తెలుగు వారియర్స్ కూడా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ప్రొఫెషనల్ మ్యాచ్ ల తరహాలో హోరాహోరీగా సాగుతున్న సీసీఎల్ మ్యాచ్ లు అభిమానుల్ని బాగానే అలరిస్తున్నాయి.