Begin typing your search above and press return to search.

రాజమౌళీ.. కాచుకో అంటున్న సుదీప్

By:  Tupaki Desk   |   28 Aug 2015 11:32 AM GMT
రాజమౌళీ.. కాచుకో అంటున్న సుదీప్
X
కన్నడ నాట సుదీప్ ఫాలోయింగ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా, డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ హిట్లిచ్చి.. కన్నడ ఇండస్ట్రీ రేంజే మార్చేసిన హీరో అతను. ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సుదీప్.. ఆ సినిమా తర్వాత దక్షిణాదిన అన్ని భాషల్లోనూ కీలక పాత్రలు చేస్తూ నటుడిగా తన ప్రత్యేకత నిలుపుకుంటున్నాడు. ‘బాహుబలి’లోనూ ఓ పాత్రలో తళుక్కుమన్న సుదీప్.. తమిళ ‘పులి’లోనూ ఓ కీలక పాత్ర చేశాడు. ఐతే వరుసగా రెండు భారీ బడ్జెట్ ఎపిక్ మూవీస్ లో నటించేసరికి.. తనే స్వయంగా ఓ జానపద చిత్రం చేయాలన్న ఆలోచన వచ్చింది సుదీప్ కి. ‘బాహుబలి’ తరహాలోనే దక్షిణాది పరిశ్రమలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడతను.

ఈ సినిమాను ఒకేసారి ఐదు భాషల్లో తెరకెక్కించాలన్నది సుదీప్ ప్లాన్. ఓ విభిన్న కథాంశంతో ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడు సుదీప్. బడ్జెట్ విషయంలో ఇప్పటికే ఓ పెద్ద సంస్థ నుంచి హామీ తీసుకున్నాడట. త్వరలోనే స్క్రిప్టు పూర్తి చేసి.. నటీనటుల ఎంపిక పనిలో పడబోతున్నాడు సుదీప్. ఈ సినిమా ద్వారా రాజమౌళితో పాటు దక్షిణాది డైరెక్టర్లందరికీ సవాలు విసరాలనే పట్టుదలతో ఉన్నాడు సుదీప్. ఇప్పటిదాకా సుదీప్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కువగా రీమేకులే ఉన్నాయి. ఐతే ఇది సొంతంగా రాసుకుని తీయబోతున్న కథ. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ తరహాలో ఈ సినిమాను తీర్చిదిద్ది.. తన పేరు శాండిల్ వుడ్ లో నిలిచిపోయేలా చేసుకోవాలని భావిస్తున్నాడు సుదీప్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని అతనంటున్నాడు. అతడి ప్రయత్నం విజయవంతమవ్వాలని ఆశిద్దాం.