Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'సుబ్రహ్మణ్యపురం'

By:  Tupaki Desk   |   8 Dec 2018 9:03 AM GMT
మూవీ రివ్యూ : సుబ్రహ్మణ్యపురం
X
చిత్రం: 'సుబ్రహ్మణ్యపురం'

నటీనటులు: సుమంత్ - ఈషా రెబ్బా - సురేష్ - గిరి - సాయికుమార్ - భద్రమ్ - జోష్ రవి తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: ఆర్కే ప్రతాప్
నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి
రచన-దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి

‘మళ్ళీ రావా’ చిత్రంతో మళ్లీ ఫాంలోకి వచ్చిన హీరో సుమంత్.. ఈసారి తన శైలికి భిన్నంగా ఒక థ్రిల్లర్ సినిమా చేశాడు. అదే.. సుబ్రహ్మణ్యపురం. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కార్తీక్ (సుమంత్) ఒక నాస్తికుడు.. హేతువాది. అతను పురాతన ఆలయాల మీద పరిశోధన జరుపుతుంటాడు. అతను అనుకోకుండా చూసి ప్రేమలో పడ్డ ప్రియ (ఈషా రెబ్బా) కోసం తన ఊరైన సుబ్రహ్మణ్యపురానికి వెళ్తాడు. అంతకుముందు కొన్ని రోజుల నుంచే ఆ ఊరిలో అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటారు. దీనికి కారణం దేవుడి ఆగ్రహమే అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ కార్తీక్ ఈ ఆత్మహత్యల వెనుక గుట్టు ఏంటో తెలుసుకోవడానికి సిద్ధమవుతాడు. మరి అతనా రహస్యాన్ని ఎలా ఛేదించాడు.. ఈ ఆత్మహత్యల వెనుక అసలు కారణమేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హీరో పేరు కార్తీక్.. అతడికి దేవుడంటే నమ్మకం ఉండదు. మూఢ భక్తిని వ్యతిరేకిస్తాడు. ప్రతి విషయాన్నీ శాస్త్రీయ కోణంలో చూస్తాడు. అలాంటివాడు అనుకోకుండా ఓ గ్రామానికి వెళ్తాడు. అక్కడో సుబ్రహ్మణ్యస్వామి గుడి ఉంటుంది. ఆ ఊరిలో ఒకరి తర్వాత చనిపోతూ ఉంటారు. వాటికి దేవుడికి సంబంధం ఉందని జనాలు అనుకుంటారు. అప్పుడు హీరో రంగంలోకి దిగి మొత్తం గుట్టు బయటికి తీస్తాడు.. ఈ కథంతా చదువుతుంటే ‘కార్తికేయ’ సినిమా గుర్తుకొస్తోందా..? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘సుబ్రహ్మణ్యపురం’ కథ కూడా అచ్చం ఇలాగే సాగుతుంది. పెద్ద స్థాయి కమర్షియల్ సినిమాల కథల్లో పోలికలు ఉండటం.. ఒకే ఫార్ములాలో మళ్లీ మళ్లీ సినిమాలు రావడం మామూలే. కానీ థ్రిల్లర్ సినిమాల్లో కూడా ఇంత పోలికలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. థ్రిల్లర్ సినిమాల నుంచి ప్రధానంగా ఆశించేదే కథలో కొత్తదనం. కానీ ‘సుబ్రహ్మణ్యపురం’ ఆ విషయంలోనే తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అచ్చంగా ‘కార్తికేయ’ ఫార్మాట్లో సాగుతూ ఎగ్జైట్మెంట్ లేకుండా చేస్తుంది.

కథతోనే కాకుండా కథనం విషయంలోనూ ‘కార్తికేయ’తో పోలికలు ఉండి.. అంతే బిగితో ఈ సినిమా కూడా నడిస్తే సరేలే అని సర్దుకుపోవచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం పోలికే లేదు. అదెంత బిగితో నడుస్తుందో.. ఇదంత పేలవంగా నడుస్తుంది. ఇక క్వాలిటీ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ కూడా మంచి క్వాలిటీతో వస్తున్న ఈ రోజుల్లో ‘సుబ్రహ్మణ్యపురం’లో నిర్మాణ విలువలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో సుమంత్ ఇంతకుముందు చేసిన ‘నరుడా డోనరుడా’తో పోటీ పడుతుంది ‘సుబ్రహ్మణ్యపురం’. ఎంత విలేజ్ సినిమా అయినప్పటికీ సరైన లొకేషన్లు చూసుకోకుండా.. ఒక సీన్ తీసేముందు కనీస స్థాయిలో కూడా సెట్ ను సర్దుకోకుండా చాలా మొక్కుబడిగా లాగించేసినట్లు కనిపిస్తుంది. ఇక వివిధ పాత్రలకు ఎంచుకున్న నటీనటుల సంగతైతే సరేసరి. జబర్దస్త్ లో నవ్వులు పండించే గెటప్ శీను సూటేసుకుని వచ్చి ఏదో పరిశోధన చేస్తుంటే ఎక్కడ సీరియస్నెస్ వస్తుంది?

‘సుబ్రహ్మణ్యపురం’లో ఈ కథలోని బేసిక్ పాయింట్ భిన్నమైందే కానీ.. దాన్ని తెరమీద ప్రెజెంట్ చేసిన తీరు మాత్రం పేలవం. ఒక ఊరిలో అంతుచిక్కని విధంగా ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే.. హీరో వచ్చి వాటి గుట్టు విప్పడం మీద కథ నడుస్తుంది. ఐతే ఆత్మహత్యలు ఒకటో రెండో చూపించి.. మిగతా వాటిని మాటల్లో చెప్పేయొచ్చు. కానీ ఇందులో ఆరేడుదాకా ఆత్మహత్యలు చూపిస్తారు. కానీ ప్రతిదీ ఒకే రకంగా ఉంటుంది. సినిమా ఆరంభం నుంచి చివరి 20 నిమిషాల ముందు వరకు కూడా ఈ సీన్లు రిపీటవుతుంటాయి. చూసిందే చూసి జనాలకు విసుగొచ్చేస్తుంది ఒక దశలో. ఇక ప్రథమార్ధంలో ఓవైపు గ్రామంలో అనూహ్య సంఘటల్ని చూపిస్తూనే.. సమాంతరంగా సిటీలో హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్.. కామెడీ సీన్లు నడిపించారు. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. థ్రిల్లర్ సినిమాల్లో ఇంత సాగతీత ఏంటి.. అసలు కథలోకి ఎప్పుడు వెళ్తారు అన్న అసహనం వచ్చేస్తుంది.

ఆత్మహత్యల రహస్యాన్ని ఛేదించడానికి ఊరిలోకి అడుగుపెట్టాక కూడా హీరో చేసేదేమీ పెద్దగా ఉండదు. ఉత్కంఠ భరిత సన్నివేశాలేమీ ఉండవు. హీరో ఏదో చేస్తా ఏదో చేస్తా అంటుంటాడు. మరోవైపు అఘాయిత్యాలు కొనసాగుతుంటాయి. ప్రిక్లైమాక్స్ లో కానీ ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రాక్ లోకి రాదు. ఆత్మహత్యల వెనుక అసలు కారణాలేంటో వివరించే సన్నివేశాలు.. కథలోని సస్పెన్స్ రివీలయ్యే సీన్లు బాగుంటాయి. ఇక్కడ మాత్రం దర్శకుడి పనితనం కనిపిస్తుంది. అతను చేసిన పరిశోధన ఆకట్టుకుంటుంది. ఐతే గంటన్నర పైగా విసిగించాక.. చివర్లో ఎంత మెప్పించి ఏం లాభం? అప్పటికే పుణ్యకాలం గడిచిపోయి ఉంటుంది. ప్రేక్షకులు విసుగెత్తిపోయి ఉంటారు. ఎంత మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ దాన్ని తెరమీద సరిగా ప్రెజెంట్ చేయలేకపోతే ఏమవుతుందో చెప్పడానికి ‘సుబ్రహ్మణ్యపురం’ ఉదాహరణ. ‘కార్తికేయ’ స్టయిల్లోనే కథ రాసుకోవడం దీనికి పెద్ద బలహీనత. ఆల్రెడీ అలాంటి బిగి ఉన్న సినిమా చూశాక ఆ ఫార్మాట్లోనే కథను నడిపిస్తూ ఇంత అనాసక్తికరంగా కథనాన్ని నడిపిస్తే ఇక ప్రేక్షకులకు ఎలాంటి భావన కలుగుతుందో చెప్పేదేముంది?

నటీనటులు:

సుమంత్ తన వరకు బాగానే చేశాడు కానీ.. అతడి ప్రతిభకు పరీక్ష పెట్టే పాత్రేమీ కాదిది. పైగా అతడి పాత్రను సరిగా తీర్చిదిద్దలేదు. ఈషా రెబ్బా క్యారెక్టర్ తేలిపోయింది. ఆమె తన టాలెంట్ చూపించే స్కోప్ ఎక్కడా రాలేదు. సురేష్ కు లెంగ్తీ రోల్ దక్కింది కానీ.. ఆయన కూడా పెద్దగా చేసిందేమీ లేదు. హీరో స్నేహితుల పాత్రల్లో భద్రమ్.. జోష్ రవి పర్వాలేదనిపించారు. నెగెటివ్ రోల్ చేసిన గిరి ఆ పాత్రకు సరితూగలేదు. సాయికుమార్ ఉన్న కాసేపు మెప్పించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర పూర్తిగా నిరాశ పరిచాడు. పాటలేవీ ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం వింటుంటే.. సినిమా చూస్తూ అసలేమాత్రం ఇన్ స్పైర్ కాలేక ఏదో మొక్కుబడిగా లాగించేశాడేమో అనిపిస్తుంది. ప్రి క్లైమాక్స్ ముంగిట వచ్చే ఒక ఫైట్లో సౌండ్స్ చూస్తే ఈ చిత్రానికి శేఖర్ చంద్రేనా సంగీత దర్శకుడు అన్న సందేహం కలుగుతుంది. ఆర్కే ప్రతాప్ ఛాయాగ్రహణం కూడా ఇలాగే సాగుతుంది. నిర్మాణ విలువలు పేలవం. సుమంత్ మార్కెట్ ఎంత దెబ్బ తిన్నప్పటికీ మరీ ఈ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే జనాలు కనెక్టవడం చాలా కష్టం. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి బేసిక్ పాయింట్ వరకు మాత్రమే మెప్పించాడు కానీ.. మిగతా అన్ని రకాలుగా నిరాశ పరిచాడు. అసలతను ‘కార్తికేయ’ లాగే ఈ కథను ఎందుకు నడిపించాడన్నది అర్థం కాని విషయం. అతడి అనుభవ లేమి చాలా చోట్ల కనిపించింది.

చివరగా: సుబ్రహ్మణ్యపురం.. కార్తికేయ బ్యాడ్ వెర్షన్

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre