Begin typing your search above and press return to search.

ప్రాణాలతో చెలగాటం.. ఫైట్ మాస్టర్లపై వేటు

By:  Tupaki Desk   |   16 Oct 2018 1:20 PM GMT
ప్రాణాలతో చెలగాటం.. ఫైట్ మాస్టర్లపై వేటు
X
ఈ రోజుల్లో సినీ రంగంలో ఏ విభాగానికి చెందిన వాళ్లయినా కొత్తగా.. రొటీన్ కు భిన్నంగా ఏమైనా చేస్తే తప్ప సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. ఫైట్ మాస్టర్లు సైతం ప్రతి సినిమాలోనూ తమ ప్రత్యేకతను చూపిస్తూ ఉంటేనే అవకాశాలు వస్తాయి. ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ వచ్చేస్తోంది కాబట్టి.. ఆల్రెడీ ఉన్నవాళ్లు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం కొత్తగా కొత్త ప్రయత్నాలు ఏవో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ క్రమంలో కొన్నిసార్లు శ్రుతి మించి పోతుంటారు. రిస్కీ స్టంట్లు ప్రయత్నిస్తుంటారు. నేరుగా హీరోలతో అవి చేయించేయరు కానీ.. డూప్ లతో మేనేజ్ చేస్తుంటారు. హీరోలకు బదులుగా సాహసాలు చేసేవాళ్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ‘హ్యాపీ’ సినిమాలో అల్లు అర్జున్ తో ఫైట్ మాస్టర్ అలాంటి స్టంట్లే చేయిస్తాడు. ఇలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి.

ఇలా చేసే ఇప్పుడు ఇద్దరు ఫేమస్ స్టంట్ మాస్టర్లు నిషేధానికి గురయ్యారు. రిహార్సల్స్ సందర్భంగా ఫైటర్లతో ప్రమాదకర విన్యాసాలు చేయిస్తుండటంతో వీరిపై ఆగ్రహంచిన దక్షిణ భారత చలనచిత్ర స్టంట్‌ యూనియన్‌ వీరిపై వేటు వేసింది. యూినయన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ‘కబాలి’ స్టంట్‌ మాస్టర్లు అరివు మణి.. అన్బులను యూనియన్‌ నుంచి తొలగించారు. సోమవారం చెన్నైలోని స్టంట్‌ యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ భాషలకు చెందిన స్టంట్‌ మాస్టర్లు కూడా పాల్గొన్నారు. అన్నదమ్ములైన అరివు-అన్బు ‘మద్రాస్‌’..‘కబాలి’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించారు. ఐతే వీళ్లిద్దరూ రిహార్సల్స్‌ పేరుతో ప్రాణాపాయమైన స్టంట్లను కంపోజ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. వాళ్లు పని చేసిన సినిమాల్లోనూ ప్రమాదకర రోప్‌ ఫైట్లు కంపోజ్ చేశారని.. వాటి కోసం జరిగిన రిహార్సల్స్ చాలా ప్రమాదకరంగా సాగాయని ఆధారాలు లభించడంతో వీరిని యూనియన్ నుంచి తొలగించాలని నిర్ణయించారు.