Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ లకు సెన్సార్.. కేంద్రం రెడీ

By:  Tupaki Desk   |   14 July 2018 10:03 AM GMT
వెబ్ సిరీస్ లకు సెన్సార్.. కేంద్రం రెడీ
X
సినిమాలకు సెన్సార్ ఉంటుంది. కానీ ఇంటర్నెట్ లో మాత్రం లేదు. వాటిని నియంత్రించే వారే లేకపోవడంతో అశ్లీల, బూతు కాంటెంట్ విపరీతంగా వ్యాపిస్తోంది. నెట్ లో కొత్తగా మొదలైన వెబ్ సిరీస్ లు రచ్చ రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్ ’ తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన ‘సాక్రెడ్ గేమ్స్’ విడుదలై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. విక్రమ్ చందా నవల ‘ స్కేర్డ్ గేమ్స్’ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరిస్ లో సైఫ్ ఆలీఖాన్ - రాధికా ఆప్టే - నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించారు. అనురాగ్ కశ్యప్ - విక్రమాదిత్య మోత్వానీ నిర్మించిన ఈ వెబ్ సిరిస్ పై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ఓ చోట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని కోల్ కతా కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కూడా ఈ వెబ్ సిరీస్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా దీనిపై దుమారం రేగడంతో కేంద్రం రంగంలోకి దిగింది.

ఇప్పటిదాకా బుల్లితెర - వెండితెరలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ కత్తెరలను ఇక నుంచి వెబ్ సిరీస్ లకు వర్తింపచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కఠినతరమైన నిబంధనలు రూపొందించబోతున్నట్లు కేంద్ర సాంకేతిక - ప్రసారశాఖ ప్రకటించింది. ‘మార్గదర్శకాలు ఇప్పటికైతే ఓ కొలిక్కి రాలేదు. కానీ వాటిని రూపొందించి వీలైనంత త్వరగా అన్వయింపచేస్తాం’ అని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

‘ఇంటర్నెట్ కంటెంట్ పై నియంత్రణ లేదు.కానీ అడ్డూ అదుపు లేకుండా మేకర్లు హింస - అశ్లీలతను చూపిస్తున్నారు. ఇది శృతిమించిపోతోంది. బీప్ లేకుండా బూతు డైలాగులను వాడేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం. నియంత్రణ పేరిట.. స్వేచ్ఛను మాత్రం హరించే ఉద్దేశం లేదని’ ప్రసారం శాఖకు చెందిన ఓ అధికారి సూచన ప్రాయంగా వెల్లడించారు.