Begin typing your search above and press return to search.

ఎవ‌రీ ప‌ద్మావ‌తి.. ఏమిటీ ఆమె క‌థ‌లు

By:  Tupaki Desk   |   19 Nov 2017 5:56 AM GMT
ఎవ‌రీ ప‌ద్మావ‌తి.. ఏమిటీ ఆమె క‌థ‌లు
X
ప‌దేళ్లు కాదు.. ఇర‌వై ఏళ్లు కాదు.. ఆ మాట‌కు వ‌స్తే వందేళ్లు కూడా కాదు. ఏకంగా 200 ఏళ్ల కంటే వెనుక జ‌రిగిన చ‌రిత్ర‌కు సంబంధించిన ఒక మ‌హ‌రాణి ఇతివృత్తాన్ని క‌థావ‌స్తువుగా తీసుకొని నిర్మిస్తోన్న చిత్రం ప‌ద్మావ‌తి. బాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తీస్తార‌న్న పేరున్న సంజ‌య్ లీలా భ‌న్సాలీ.. దీపికా-ర‌ణ‌వీర్ తో క‌లిపి తీసిన చిత్రం ప‌ద్మావ‌తి. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి తీశార‌న్న ఆరోప‌ణ‌తో పాటు.. మ‌నోభావాలు దెబ్బ తీసేలా క‌థావ‌స్తువు ఉందన్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఆవేశం తోడు కావ‌టంతో ఈ సినిమా వ్య‌వ‌హారం ఇప్పుడో పెద్ద ర‌చ్చ‌గా మారింది.

ఇంత‌కీ ప‌ద్మావ‌తి ఎవ‌రు? ఆమె చ‌రిత్ర ఏమిటి? ఆమెకు సంబంధించి చ‌రిత్ర అంతా ఒకేలా ఉందా? అంటే లేద‌ని చెప్పాలి. ఆమె మీద క‌నీసం మూడు నాలుగు వాద‌న‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భ‌న్సాలీ తీసిన సినిమాలో.. చ‌రిత్ర‌లోనూ ఒకేలాంటి క‌థ ఉందా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. తాజాగా తీసిన సినిమాలో ప‌ద్మావ‌తి చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని.. ఆమె ఔన్న‌త్యాన్ని మంట‌ గ‌లిపార‌ని హిందూ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

హిందీ రాష్ట్రాలైన‌ రాజ‌స్థాన్‌.. బీహార్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఇదో పెద్ద వివాదంగా మారింది. చిత్తోర్ ఘ‌ర్ రాణి ప‌ద్మావ‌తి చ‌రిత్ర‌కు సంబంధించి జాన‌ప‌దులు పాడుకునే పాట‌లు.. మాలిక్ మొహ‌మ్మ‌ద్ జ‌యాసీ అనే సూఫీ క‌వి రాసిన క‌విత మాత్ర‌మే ఆమెకు సంబంధించిన ఆధారంగా చెబుతుంటారు. ప‌ద్మావ‌తికి సంబంధించి ప్ర‌చారంలో ఉన్న ముఖ్య‌మైన మూడు క‌థ‌ల్లోనూ కొన్ని అంశాలు కామ‌న్ గా ఉంటాయి.

స్థూలంగా ప‌ద్మావ‌తి క‌థ‌ను చూస్తే.. అపురూప సౌంద‌ర్య‌రాశి అయిన ప‌ద్మావ‌తి సింహ‌ళ‌దేశ రాజ‌కుమారి. ఆమె చిత్తోర్ ఘ‌ర్ రాజు ర‌త్న‌సేనుడ్ని పెళ్లాడుతుంది. ఆమె అందం గురించి విన్న అల్లావుద్దీన్ ఖిల్జీ.. ఆమె కోసం చిత్తోర్ ఘ‌ర్ పైకి దండెత్తుతాడు. ఆమెను ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఆమె ద‌క్క‌దు. ఆ సంద‌ర్భంగా జ‌రిగే యుద్ధంగా ఆమె భ‌ర్త మ‌ర‌ణిస్తాడు. భ‌ర్త మ‌ర‌ణంతో ఆమె స‌తీ స‌హ‌గ‌మ‌నం చేస్తుంది. అయితే.. ఇది నిజం కాద‌ని.. ఉత్త క‌ల్ప‌నేన‌ని చెబుతారు. ప్ర‌చారంలో ఉన్న క‌థ‌నాలు చూస్తే..

మొద‌టిది..

ప‌ద్మావ‌తిని రాణి ప‌ద్మిని అని పిలిచేవారు. ఆమెకో మాట్లాడే చిలుక ఉండేది. నిత్యం చిలుక‌తో గ‌డిపే కూతుర్ని చూసిన సింహ‌ళ రాజు గంధ‌ర్వ‌సేనుడికి చిరాకు పుట్టేది. చిలుక‌ను చంపాల‌నుకుంటాడు. అది తెలుసుకున్న ప‌ద్మావ‌తి చిలుక‌ను బ‌య‌ట‌కు విడిచిపెడుతుంది. ఆ చిలుక కాస్తా పిట్ట‌లు అమ్ముకునే వ్య‌క్తికి చిక్కి త‌ర్వాత చిత్తోర్ ఘ‌ర్ రాజు ర‌త్న‌సేనుడి వ‌ద్ద‌కి చేరుతుంది.

రాజుకు ప‌ద్మావ‌తి అందం గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెబుతుంది చిలుక‌. దీంతో ప‌ద్మావ‌తిని త‌న సొంతం చేసుకోవాల‌నుకుంటాడు ర‌త్న‌సేనుడు. 16వేల మంది సైన్యంతో సింహ‌ళ దేశానికి వెళ‌తాడు. శివ‌భ‌క్తుడైన అత‌డు గుళ్లో పూజ‌లు చేసే స‌మ‌యంలో గుడికి ప‌ద్మావ‌తి వ‌చ్చి వెళుతుంది. ఆమెను చూడ‌లేక‌పోయాన‌న్న బాధ‌తో చ‌నిపోవాల‌నుకుంటాడు.

అప్పుడు శివ‌పార్వ‌తులు ప్ర‌త్య‌క్ష‌మై.. కోట‌కు వెళ్లి యువ‌రాణిని క‌ల‌వ‌మ‌ని చెబుతారు. భ‌క్తుడి వేషంలో ఉన్న అత‌డు కోట‌కు వెళతాడు. సింహ‌ళ‌రాజు అత‌డ్ని బంధించి చంపాలంటాడు. అయితే.. ర‌త్న‌సేనుడి వెంట ఉన్న వారు త‌మ రాజు గురించి చెప్ప‌టంతో సంతోషంతో త‌న కుతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. 16 వేల మంది ప‌ద్మినీ జాతి స్త్రీల‌ను ఇస్తాడు. వారంతా చిత్తోర్ గ‌ఢ్‌ కు వెళ్లే క్ర‌మంలో తుపానులో ఇరుక్కుంటారు. శివుడి ద‌య‌తో బ‌య‌ట‌ప‌డ‌తారు.

చివ‌ర‌కు త‌న రాజ్యానికి చేరుకుంటాడు. అప్ప‌టికే నాగ‌మ‌తి అనే భార్య ఉంటుంది. ఒక‌సారి ప‌ద్మావ‌తితో రాజు ఏకాంతంలో ఉన్న వేళ‌లో ఆమె బంటు అయిన రాఘ‌వ చేత‌నుడ‌నే బ్రాహ్మ‌ణుడు లోప‌ల‌కు వ‌స్తాడు. ఆగ్ర‌హించిన ర‌త్న‌సేనుడు దేశ బ‌హిష్కారం విధిస్తాడు. అత‌డు వెళ్లే స‌మ‌యంలో అపురూప‌మైన గాజుల జ‌త ఇస్తుంది ప‌ద్మావ‌తి. చిత్తోరు నుంచి ఢిల్లీకి వెళ్లిన రాఘ‌వ అక్క‌డ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని క‌లుస్తాడు.

గాజుల జ‌త‌ను గురించి ఖిల్జీ అడిగిన‌ప్పుడు ప‌ద్మావ‌తి గురించి.. ఆమె సౌంద‌ర్యం గురించి చెబుతాడు. దీంతో ఆమెను సొంతం చేసుకోవ‌టానికి చిత్తోర్ గ‌ఢ్‌ కు వెళ‌తాడు. యుద్దంలో గెల‌వ‌లేక‌పోతాడు. చివ‌ర‌కు సంధి కుదురుతుంది. ఖిల్జీని కోట‌కు ఆహ్వానిస్తాడు ర‌త్న‌సేనుడు. ప‌ద్మావ‌తిని చూస్తాడే త‌ప్ప ఆమె ద‌క్క‌దు. సంధికి ఒప్పుకున్న‌ట్లే ఒప్పుకొని ర‌త్న‌సేనుడ్ని బంధించిన ఖిల్జీ ఢిల్లీకి వెళ్లిపోతాడు.

భ‌ర్త‌ను విడిపించ‌మంటూ ఇద్ద‌రు సైన్యాధికారుల్ని ఢిల్లీకి పంపుతుంది ప‌ద్మావ‌తి. సుల్తాన్ తో సైనికులు పోరాడి ఒక‌రు చ‌నిపోతే.. మ‌రొక‌రు పోరాడి రాజును క్షేమంగా తీసుకొస్తారు. అదే స‌మ‌యంలో రాజు లేని రాజ్య‌మ‌న్న విష‌యం తెలుసుకొని పొరుగున ఉన్న దేవ‌పాలుడ‌నే రాజు ప‌ద్మావ‌తిని సొంతం చేసుకోవ‌టానికి వ‌స్తాడు. అదే స‌మ‌యంలో రాజ్యానికి చేరుకున్న ర‌త్న‌సేనుడు.. దేవ‌పాలుడుతో త‌ల‌ప‌డ‌తాడు. యుద్ధంలో ఇద్ద‌రు మ‌ర‌ణిస్తారు. భ‌ర్త మ‌ర‌ణ వార్త‌ను విన్న ప‌ద్మావ‌తి స‌తీ స‌హ‌గ‌మ‌నం చేస్తుంది.

ప‌ద్మావ‌తితో పాటు ర‌త్న‌సేనుడి మొద‌టి భార్య కూడా చితిలోకి దూకి మ‌ర‌ణిస్తుంది. కొన్నాళ్ల‌కు ఖిల్జీ చిత్తోర్ గ‌ఢ్‌ ను సొంతం చేసుకోవ‌టానికి దండెత్తుతాడు. రాణివాసంలోని వారిని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. ఇది తెలిసిన వారు సామూహికంగా ఆత్మాహుతికి పాల్ప‌డ‌తారు. ఇప్ప‌టికి వారు చితిపేర్చి మ‌ర‌ణించిన స్థ‌లం.. జౌహార్ కుండ్ చిత్తోర్ గ‌ఢ్ స‌మీపంలో ఉంది. ద‌ర్శ‌నీయ స్థ‌లాల్లో ఇదొక్క‌టి చెబుతారు. ఖిల్జీ ఎంత ప్ర‌య‌త్నించినా ప‌ద్మావ‌తి కానీ.. రాణివాసంలోని మ‌హిళ‌లు కానీ ద‌క్క‌లేదు. రాళ్లు.. ఇటుక‌ల‌తో చేసిన కోటను మాత్ర‌మే ఖిల్జీ ఇస్లాంలోకి మార్చ‌గ‌లిగాడ‌న్న వ్యంగ్యంతో మొద‌టి క‌థ ముగుస్తుంది.

రెండో క‌థ‌..

ఈ క‌థ‌నే రాజ్ ఫుట్ లు ఎక్కువ‌గా న‌మ్ముతుంటారు. ప‌ద్మావ‌తి సింహ‌ళ‌దేశ రాజ‌కుమార్తె. క‌త్తి యుద్ధంలో ఆమెకు సాటి ఎవ‌రూ రారు. క‌త్తి యుద్ధంలో తాను చెప్పిన వ్య‌క్తిని ఓడించే వీరుడ్నే పెళ్లాడ‌తాన‌ని ప్ర‌క‌టిస్తుంది. ఇంత‌కీ ఆమె చెప్పే వ్య‌క్తి ఎవ‌రో కాదు ఆమే. అలా చాలామంది రాజులు ఆమె చేతిలో ఓడిపోతారు. అయితే రాజ్ పుట్ రాజైన చిత్తోర్ గ‌ఢ్ రాజు ర‌త్న‌సేనుడు ఆమెను గెలుస్తాడు. దీంతో అత‌న్ని పెళ్లాడుతుంది ప‌ద్మావ‌తి. ఆమెకు బంటు రాఘ‌వ చేత‌నుడు.

మాంత్రికుడైన అత‌డ్ని ర‌త్న‌సేనుడు దేశం నుంచి వెలివేయిస్తాడు. అక్క‌డ నుంచి ఢిల్లీ వెళ్లిన రాఘ‌వ చేత‌నుడు ఢిల్లీ రాజు ఖిల్జీకి ప‌ద్మావ‌తి అందం గురించి చెబుతాడు. ఆమెను కీర్తిస్తాడు. ఆమెను సొంతం చేసుకోవ‌టానికి ఖిల్జీ చిత్తోర్ గ‌ఢ్ మీద‌కు దండెత్తుతాడు. ఆ యుద్ధంలో ర‌త్న‌సేనుడు మ‌ర‌ణిస్తాడు. ఖిల్జీకి ద‌క్క‌కుండా ఉండేందుకు ప‌ద్మావ‌తి ర‌హ‌స్య మార్గంలో జౌహార్ కుండ్‌కు చేరి చితిలో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఖిల్జీకి త‌న‌ను తాను ద‌క్క‌కుండా చేస్తుంది.

మూడో క‌థ‌..

ఈస్టిండియా కంపెనీలో ప‌ని చేసిన జేమ్స్ టాడ్ అనే అధికారి రాజ్ పుట్ చ‌రిత్ర‌ను ప‌రిశోధించి మ‌రో క‌థ చెప్పాడు. ఇందులో పద్మావ‌తి క‌థ కాస్త మారుతుంది. ఆమెను సింహ‌ళ దేశ ప్ర‌భువు కుమార్తెగానే చెబుతారు. అయితే.. ఆమె పెళ్లి విష‌యంలోనే తేడా క‌నిపిస్తుంది.

చిత్తోర్ గ‌ఢ్ ను పాలించే రాజు ల‌క్ష్మ‌ణ్ సింగ్‌. ఇత‌ను బంధువైన భీమ్ సింగ్ ను ప‌ద్మావ‌తి పెళ్లాడుతుంది. ఆమె అందం గురించి తెలిసిన డిల్లీ రాజు ఖిల్జీ దండెత్తుతాడు. యుద్ధంలో సంధి చేసుకున్న ఖిల్జీ ఆమెను అద్దంలో చూడాలని కోరుకుంటాడు. ఆమెను చూసిన ఖిల్జీ కుట్ర‌తో భీమ్ సింగ్ ను బంధిస్తాడు. ప‌ద్మావ‌తిని త‌న‌కిస్తేనే విడుద‌ల చేస్తానంటాడు. దీంతో ప‌ద్మావ‌తి రంగంలోకి దిగుతుంది. త‌న బంధువుల‌ను సాయం అడిగిన ప‌ద్మావ‌తికి అండ‌గా ఆమె బంధువులు వ‌స్తారు. 700 రాజ్ పుట్ సైనికుల‌తో ఖిల్జీని ఎదిరిస్తాడు. ఖిల్జీతో పోరాడుతూ భీమ్ సింగ్ మ‌ర‌ణిస్తాడు. దీంతో ప‌ద్మావ‌తి అగ్నిగుండంలో దూకి త‌న ప్రాణాల్ని తీసుకుంటుంది.