మనం ఎంటర్ ప్రైజస్.. అదే అసలు కథ

Thu Dec 07 2017 16:55:20 GMT+0530 (IST)

అక్కినేని అఖిల్ 'హలో' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను చూడగానే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాతల్లో కేవలం అక్కినేని నాగార్జున అనే పేరు మాత్రమే ఉంది కాని.. అక్కడ ప్రొడక్షన్ హౌసుల పేర్లను చూస్తే మాత్రం.. 'అన్నపూర్ణ స్టూడియోస్' మరియు 'మనం ఎంటర్ ప్రైజస్' అని ఉంది. అయితే కొత్తగా వచ్చిన ఈ కంపెనీ ఏంటబ్బా అంటూ చాలామందికి ఆల్రెడీ సందేహం వచ్చే ఉంటుంది.నిజానికి నాగార్జున మాత్రమే కాదు.. ఇప్పటివరకు అక్కినేని కుటుంబంకు చెందిన అందరి సినిమాలూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మితమవుతున్నాయి. నాగ్.. చైతు.. అఖిల్.. సుశాంత్.. సుమంత.. ఇలా చాలామంది హీరోలకు ఈ బ్యానరే నిలయం. అయితే ఇప్పుడు నాగ్ కేవలం తనూ.. తన కొడుకు చైతు అండ్ అఖిల్ పార్టనర్లుగా ఉంటూ 'మనం ఎంటర్ ప్రైజస్' అనే బ్యానర్ స్థాపించారట. ఇందులో ఈ ముగ్గురు హీరోలు మాత్రమే సినిమాలు చేస్తారట. అంటే ఇది నాగ్ పర్సనల్ ఫ్యామిలీ బ్యానర్ అనమాట.

ఇకపోతే మనం అనే పేరును ఎందుకు పెట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం అనే సినిమా అక్కినేని వారి ఆఖరి సినిమా కావడం.. అలాగే ఆ సినిమాలో మొత్తంగా అక్కినేని ఫ్యామిలీ అంతా కనిపించడం.. ఆ విధంగా అదొక ప్రత్యేకమైన సినిమా అయినందును.. ఆ పేరును పెట్టుకున్నారు.