Begin typing your search above and press return to search.

ఒక మరణం.. ఇద్దరు హీరోలు.. మనం..

By:  Tupaki Desk   |   26 Aug 2016 10:30 PM GMT
ఒక మరణం.. ఇద్దరు హీరోలు.. మనం..
X
ఎవరో బ్రిటీష్‌ జర్నలిస్టు 120 కోట్లమంది ఉన్న మీరు 2 మెడల్స్ ను గెలుచుకుని ఆనందిస్తున్నారా అంటూ కామెంట్ చేస్తే.. మనోళ్ళు ట్విట్టర్ లో అతనికి భరితపూజ చేశారు. కాశ్మీర్ లో జరుగుతున్న తంతను ప్రశ్నిస్తే.. బలోచిస్తాన్ పేరు చెప్పి పాకిస్తాన్ చెంప చెళ్ళమనిపించారు. అవన్నీ పక్క దేశాలవారిపై చేసే కామెంట్లు కాబట్టి.. ఏదైనా అనొచ్చు. ఇదే మన దేశంలో.. మన ఊరిలో.. ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పొడిచి చంపేస్తే.. దానికి హీరోల అభిమానులూ అనే కలర్ అద్దేసి.. అందులో ఒక హీరో సినిమా త్వరలో రిలీజవుతోంది కాబట్టి దానిని బ్యాన్ చేయాలంటూ రచ్చ చేస్తుంటే.. అసలు మనల్ని మనం ఏమనుకోవాలి? కాస్తయినా మనకు కామన్ సెన్స్ ఉందా?? ఏం చేస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో తెలుస్తోందా???

నిజానికి తిరుపతిలో జరిగిన ఒక హత్య.. ఇంత ప్రకంపనాలు రేపేదే కాదేమో. బహుశా దాని చుట్టూ హీరోల అభిమానులు అనే కలర్ పూయడం వలనే ఇలాంటి హైప్ వచ్చేసింది. దానికితోడు మన మీడియాలు వీటి మీద డిస్కషన్లు.. ఎనాలిసిస్ లు.. అబ్బో రచ్చ లేపేశారంతే. కాని మనం అర్దం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. హత్య చేసిన ప్రతీవాడూ ఏదో ఒక కులానికో - మతానికో - ప్రాంతానికో - దేశానికో - జాతికో చెందినవాడే. అందుకని.. ఆ కులాన్ని - మతాన్ని - ప్రాంతాన్ని - దేశాన్ని - జాతినీ బూతులు తిట్టడం.. వారిని బ్యాన్ చేయమనడం.. ఇవన్నీ రేసిస్ట్ ప్రవృత్తి కంటే దారుణమైన విషయాలు. కాని మనోళ్లు ఎక్కడా తగ్గట్లేదు. ఒక హీరో ఫ్యాన్ చంపాడు కాబట్టి.. ఆ హీరో సినిమాను బ్యాన్ చేయమనడం ఎంత తప్పంటే.. ఒక మతానికి చెందిన తీవ్రవాది చాలామందిని చంపాడు కాబట్టి.. ఆ మతాన్ని బ్యాన్ చేయమని అడిగినట్లే. ఇలాంటి వాదన.. వాదం.. మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో ఆలోచించుకోండి. మనం అసలు ఎటెళుతన్నాం. 'మనిషి' అనేవాడిలోనే అన్ని రకాల స్వభావాలు - ప్రవర్తనలు కలిగినవారు ఉంటారు. వారిని మళ్ళీ ఇలా 'అభిమానులు' వంకాయ్ కాకరకాయ్ అంటూ విడదీయక్కర్లేదు. ఒక రకంగా చూస్తే.. అసలు తోటి వ్యక్తిని చంపేంత ప్రవృత్తి కలిగివాళ్ళగా సదరు కిల్లర్లను తయారు చేసినందుకు.. ముందు తల్లిదండ్రులనూ తరువాత సొసైటీనే దూషించాలి. ఆ ఇద్దరు హీరోలూ ఏం చేస్తారు చెప్పండి? వీళ్లేమన్నా చంపమని చెప్పారా లేకపోతే అతివాదన వినిపించమన్నారా?

మరో కోణంలో చూస్తే హీరోలు కూడా కాస్త మారాల్సిందే. తమ సినిమాల్లో డైలాగులు సందర్భానుచితంగా పెట్టాం అంటారు కాని అవి ప్రత్యర్ధులను టార్గెట్ చేసినట్లే ఉంటాయి. అలాంటివి చేయడం కారణంగా అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలే వెళుతున్నాయి. ఏవండి.. ఆడియో ఫంక్షన్లలో మాట్లాడేటప్పుడు.. మా ఇంటి పేరుకు అభిమానులు.. మా నాన్న పేరుకి అభిమానులు.. మా రాజసం.. మా బ్లడ్.. గాడిదగుడ్డూ అనకుండా.. ''సినిమా అభిమానులు'' అని పిలిచి ఫ్యాన్స్ అందరినీ ఒక్కటి చేయకూడదా? ఇకపోతే అభిమానిని తప్పుదు దారిపట్టిస్తున్న హీరోది ఎంత తప్పో.. కేవలం ఎంటర్టయినింగ్ ఆప్షన్ గా చూడకుండా హీరోలను ఒక దేవుడిగా చూస్తున్నందుకు అభిమానులది అంతే తప్పు.

-హ్యప్రా