స్టార్ హీరో 50 ఎకరాలు కొనేశాడు

Sun Jul 15 2018 15:25:34 GMT+0530 (IST)

సినిమాల్లో కొంచెం సంపాదించగానే ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామా అని చూస్తారు ఫిలిం సెలబ్రెటీలు. వాళ్లకు ముందు కనిపించే ఆప్షన్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ శివార్లలో మంచి ఏరియా చూసి భారీగా స్థలం కొనేస్తుంటారు. అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవడమో.. లేదంటే డెవలప్మెంట్ కు ఇచ్చి ప్లాట్లు వేయడమో చేస్తుంటారు. తాజాగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఈ కోవలోనే హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున స్థలం కొన్నట్లు సమాచారం. ఆ హీరో ఏకంగా 50 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడట. అందుకోసం భారీగా పెట్టుబడి కూడా పెట్టాడట. ఈ స్థలంలో ఒక స్టూడియో కట్టడంతో పాటు పలు నిర్మాణాలు చేపట్టాలని ఆ హీరో భావిస్తున్నాడట. కొన్న స్థలానికి కంచె వేసి పనులు మొదలుపెట్టేసినట్లు సమాచారం. స్థానికులు కొందరిని ఆ స్థలం రక్షణ కోసం సెక్యూరిటీగా నియమించుకున్నాడట.విశేషం ఏంటంటే.. ఈ స్థలానికి దగ్గర్లోనే ఒక ప్రముఖ రాజకీయ నేత కూడా పెద్ద ఎత్తున స్థలం కొన్నాడట. వీళ్లిద్దరూ మార్కెట్ రేటు కంటే కొంచెం ఎక్కువ మొత్తమే పెట్టి స్థలం కొన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇక్కడ ఏవో ప్రాజెక్టులు వస్తాయని.. బాగా అభివృద్ధి జరుగుతుందని ఆ హీరో.. ఆ నేత అంచనా వేస్తున్నట్లు సమాచారం. అందుకే ముందుగా మేల్కొని పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల ఇలా సినీ తారలు వేల కోట్లల్లో పెట్టుబడులు పెట్టారు. పదుల ఎకరాలు కొనుగోలు చేసి.. ఫాం హౌస్ లు కట్టుకున్నారు. ‘రంగస్థలం’తో పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్.. లాభాల్లో వాటా అందుకున్న సుకుమార్ సైతం హైదరాబాద్ శివార్లలో స్థలం కొనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.