Begin typing your search above and press return to search.

సినిమా బాలేదా.. ఫోన్ చేయమంటున్నారు

By:  Tupaki Desk   |   25 May 2017 8:18 AM GMT
సినిమా బాలేదా.. ఫోన్ చేయమంటున్నారు
X
ఈ రోజుల్లో ఓ చిన్న సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. అందులోనూ అందరూ కొత్తవాళ్లు నటించిన సినిమా మీద క్యూరియాసిటీ పెంచడం మరీ కష్టం. పబ్లిసిటీని కొత్త పుంతలు తొక్కిస్తే తప్ప ప్రేక్షకుల్ని ఆకర్షించడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఓ చిన్న సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. ఆ సినిమా పేరు.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట. నరేష్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని విభిన్నంగా ప్రమోట్ చేస్తున్నారు. మామూలుగా తమ సినిమా బాగుంటే ఫోన్ చేసి చెప్పండి అని అడుగుతారు కదా.. కానీ ఈ సినిమా విషయంలో భిన్నమైన ప్రకటన చేశాడు దర్శకుడు.

తమ సినిమా బాలేకుంటే ఫోన్ చేసి చెప్పమని అడుగుతున్నాడు నరేష్. ఇందుకోసం అతను ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. సినిమా చూసి.. బాలేకుంటే 9059920007 అనే నంబర్ కు ఫోన్ చేయమని అతను కోరాడు. ఇది తన సినిమా మీద అతడికున్న నమ్మకం కావచ్చు. గాయత్రి ప్రొడక్షన్స్ అనే కొత్త బేనర్లో తెరకెక్కిన ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటించారు. ఈ సినిమాను ఆల్రెడీ పాత్రికేయులకు.. సినీ జనాలకు ప్రివ్యూలు వేశారు. రెస్పాన్స్ బాగానే ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఈ చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో పాటే ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి విభిన్నమైన పబ్లిసిటీ జనాల్ని ఎంతమేరకు థియేటర్లకు తీసుకొస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/