చల్లగా పనికానిస్తున్న నితిన్

Tue Apr 17 2018 16:10:57 GMT+0530 (IST)

యంగ్ హీరో నితిన్ కి  ఈ మధ్య టైమ్ బాగున్నట్టు లేదు. భారీ బడ్జెట్‌తో తీసిన ‘లై’... బయ్యర్లకు భరించలేని నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత తన ఆరాధ్యనటుడు పవన్ కల్యాణ్ సహాయ- సహాకారాలతో తెరకెక్కిన ‘ఛల్ మోహనరంగ’ కూడా... అబ్బాయి ‘రంగస్థలం’ దెబ్బతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు సాధించడానికి నానా కష్టాలు పడుతోంది. అయితే అవన్నీ పక్కనపెట్టి తన దారిలో తాను ఇంకో షూటింగులో బిజీ అయ్యాడు నితిన్.ప్రస్తుతం నితిన్... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘శతమానం భవతి’ వంటి మంచి కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగ్నేష ఈ చిత్రానికి దర్శకుడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం నందితా శ్వేతా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీనివాసుడి కల్యాణాన్ని నేటి తరానికి తగ్గట్టుగా మలిచి భార్యభర్తల మధ్య ఉండే అనురాగాలు- ఆప్యాయతులు- అనుమానాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో షెడ్యూల్ ని కూడా మొదలెట్టేసింది.

చంఢీఘర్ లో ఈరోజు మొదలైన ఈ షెడ్యూల్ లో రాశిఖన్నా- నితిన్ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ముగించి వేసవి చివర్లో థియేటర్లలోకి తేవాలనుకుంటోంది చిత్ర బృందం. నితిన్ కి ఈ సినిమా అయినా హిట్టునిస్తుందో లేదో... తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.