మూవీ రివ్యూ : 'శ్రీనివాస కళ్యాణం'

Thu Aug 09 2018 14:45:17 GMT+0530 (IST)

చిత్రం: 'శ్రీనివాస కళ్యాణం’'నటీనటులు: నితిన్ - రాశి ఖన్నా - ప్రకాష్ రాజ్ - జయసుధ - రాజేంద్ర ప్రసాద్ - సితార - ఆమని - జయసుధ  - నందిత శ్వేత - పూనమ్ కౌర్ - నరేష్ - ప్రవీణ్ - విద్యుల్లేఖ - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: రాజు - శిరీష్
రచన - దర్శకత్వం: సతీశ్ వేగేశ్న

గత ఏడాది ‘శతమానం భవతి’తో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఆ సినిమాను నిర్మించిన దిల్ రాజుతోనే ఇప్పుడతను ‘శ్రీనివాస కళ్యాణం’ చేశాడు. నితిన్-రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి ప్రోమోలతో అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకునేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

శ్రీనివాస రాజు అలియాస్ వాసు (నితిన్) చదువు పూర్తి చేసి ఛండీగఢ్ లో ఉద్యోగం చేస్తుంటాడు. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన అతడికి సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. అతడికి అనుకోకుండా శ్రీ (రాశి ఖన్నా) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ముందు మధ్య తరగతి అమ్మాయిలా పరిచయం అయిన శ్రీ బిలియనీర్ అయిన ఆర్కే (ప్రకాష్ రాజ్) కూతురని తర్వాత తెలుస్తుంది. వాసు.. అతడి కుటుంబ సభ్యుల ఆలోచనలకు పూర్తి భిన్నమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆర్కే. వాసు-శ్రీల పెళ్లికి అతను ఒప్పుకున్నప్పటికీ.. అతను కొన్ని షరతులు పెడతాడు. అదే సమయంలో వాసు కూడా ఆయనకు ఒక షరతు పెడతాడు. మరి ఈ షరతులేంటి.. వాసు-శ్రీల పెళ్లి సజావుగా జరిగిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఉరుకులు పరుగుల జీవితాల్లో పడి మానవ సంబంధాల గురించి.. మన మూలాలు.. సంప్రదాయాల గురించి మరిచిపోతున్న వైనాల్ని గుర్తు చేస్తూ.. సినిమా ద్వారా ఒక కదలిక తెచ్చే ప్రయత్నం గత కొన్నేళ్ల నుంచి తరచుగా జరుగుతోంది. ఈ కోవలో వచ్చిన కొన్ని ‘మంచి’ సినిమాలు చక్కటి విజయం సాధించాయి. కానీ ఇలాంటి విషయాల్ని వినోదపు పూతతో చెప్పాలి. భావోద్వేగాలు సరిగా పండేలా చూసుకోవాలి. నాటకీయత ఎక్కువైపోకుండా చూసుకోవాలి. ప్రేక్షకులకు ఏదో మంచి చెప్పాలనే ఉద్దేశంతో మరీ హద్దులు దాటిపోకూడదు. ఈ విషయాల్లో తేడా వస్తేఏమవుతుందో చెప్పడానికి సరైన ఉదాహరణ ‘బ్రహ్మోత్సవం’. ‘శ్రీనివాస కళ్యాణం’ దాంతో పోల్చ దగ్గ సినిమా కాదు కానీ.. దాని ఛాయలు మాత్రం ఇందులో కొంతమేర కనిపిస్తాయి. సతీశ్ వేగేశ్న ఇంతకుముందు తీసిన ‘శతమానం భవతి’ వినోదం పంచుతూనే సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేస్తే.. ఈసారి సందేశమే ప్రధానంగా మారి.. వినోదం బ్యాక్ సీట్ తీసుకుంది. కుటుంబ ప్రేక్షకులకు కనెక్టయ్యే అంశాలు ఇందులో ఉన్నప్పటికీ.. ప్రేక్షకులకు వినోదం పంచడం అనే ప్రాథమిక విషయాన్ని మరిచిపోయి.. పెళ్లి గురించి.. మన సంప్రదాయాల గురించి వాళ్లకు అదే పనిగా క్లాస్ పీకుతున్న భావన కలిగిస్తుంది ‘శ్రీనివాస కళ్యాణం’ చూస్తుంటే.

‘శ్రీనివాస కళ్యాణం’ మంచి ఉద్దేశంతో తీసిన సినిమానే. పెళ్లి అనేది ఈ రోజుల్లో ఒక ఈవెంట్ లాగా మారిపోతోందని.. అందులో ఉన్న మాధుర్యాన్ని.. అనుభూతుల్ని ఈ తరం ఆస్వాదించలేకపోతోందని చర్చిస్తూ.. పెళ్లి గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు చేసిన ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం’. కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యే పాయింట్ తీసుకున్నాడు సతీశ్ వేగేశ్న. వాళ్లను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. సినిమా అంతా కూడా బోలెండంత మంది జనాలతో.. సందడి సందడిగా ఉంటూ.. మానవ సంబంధాలు.. మన సంప్రదాయాలు.. పెళ్లి గురించి మంచి విషయాలు చెబుతూ సాగిపోతుంది. ఐతే సినిమాలో చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా చెప్పడానికి ప్రయత్నించాలి కానీ.. అదే పనిగా డైలాగుల రూపంలో చెప్పడానికి ప్రయత్నించడంతోనే వచ్చింది సమస్య. రెండున్నర గంటల సినిమాలో సగం దాకా డైలాగులే నిండిపోయాయి. అందులో సగానికి పైగా డైలాగులు పెళ్లి గొప్పదనాన్ని చెబుతూ క్లాస్ పీకడానికే కేటాయించారు.

‘శ్రీనివాస కళ్యాణం’లో ప్రేమకథ అంత బలంగా లేదు. ఇందులో ఏ మలుపులూ ఉండవు. వాళ్ల మధ్య సంఘర్షణకే తావు లేకపోయింది. తొలి సన్నివేశంలోనే ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇంప్రెస్ అయిపోతారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలేమీ కనిపించవు. పరస్పరం ప్రేమను చెప్పుకునే సన్నివేశాలు కూడా సాధారణంగా ఉంటాయి. భిన్న నేపథ్యాలున్న హీరో హీరోయిన్లు సరైన కారణాలు లేకుండా ప్రేమలో పడటమే ఆశ్చర్యమంటే.. తన కూతురు ఒక మధ్య తరగతి కుర్రాడిని ప్రేమిస్తోందంటే బిలియనీర్ అయిన తండ్రి కూడా అడ్డు చెప్పడు. మరీ ఇంత పాజిటివిటీ ఏమిటో అర్థం కాదు. ఐతే ప్రథమార్ధం బోరింగ్ గా అయితే అనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రవీణ్-విద్యుల్లేఖ కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఐతే ఏదో అలా టైంపాస్ అయిపోయినప్పటికీ.. కథ అయితే మరీ ఫ్లాట్ గా సాగిపోవడం నిరాశ కలిగిస్తుంది.

ఈ కథలో బలమైన కాన్ ఫ్లిక్ట్ పాయింట్ లేకపోయింది. విరామం ముంగిట వచ్చే మలుపు చూస్తే.. ద్వితీయార్ధంలో సినిమా ఎలా నడుస్తుందో.. ఎలా ముగుస్తుందో ముందే ఒక అంచనాకు వచ్చేయొచ్చు. మానవ సంబంధాల్ని మరిచిపోయి బిజీ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఒక పల్లెటూరికి వచ్చే అక్కడి మనుషుల మధ్య కొన్ని రోజులు తిరగ్గానే మారిపోవడం అన్నది ఎన్ని సినిమాల్లో చూశామో? ‘శతమానం భవతి’లోనూ చూసింది అదే. మళ్లీ ఇక్కడా ప్రకాష్ రాజ్ పాత్రను అలాగే చూపించారు. పల్లెటూరి నేపథ్యంలో కలర్ఫుల్ విజువల్స్.. పెళ్లి వాతావరణం అదీ ఆకట్టుకున్నప్పటికీ.. బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదు. ప్రతి సీన్లోనూ నాటకీయతే కనిపిస్తుంది. పతాక సన్నివేశంలో మెలోడ్రామా మరీ ఎక్కువైపోయింది. ప్రథమార్ధంలో యువతకు నచ్చే అంశాలున్నాయి కానీ.. ద్వితీయార్ధమంతా పూర్తిగా కుటుంబ ప్రేక్షకుల్నే లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ వచ్చే సన్నివేశాలు.. సంభాషణలు ఆ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఐతే ఏ సీన్ కొత్తగా మాత్రం కనిపించదు. పెళ్లి గొప్పదనాన్ని.. దాని విలువను చాటిచెప్పే ప్రయత్నంలో ప్రీచీగా తయారైన ‘శ్రీనివాస కళ్యాణం’ కుటుంబ ప్రేక్షకులకు ఓకే కానీ.. మిగతా వర్గాలకు కష్టమే.

నటీనటులు:

శ్రీనివాస రాజుగా నితిన్ ఓకే. అతడి లుక్.. నటన బాగానే ఉన్నాయి. ప్రథమార్ధంలో మామూలుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో.. చివరికి వచ్చేసరికి నితిన్ మంచి ఇంప్రెషనే కలిగిస్తాడు. ‘తొలి ప్రేమ’ తర్వాత రాశి స్థాయికి తగ్గ పాత్ర కాదిది. ఆమె అందంగా కనినిపించింది కానీ.. నటనలో ప్రత్యేకత చూపించే అవకాశమే ఇవ్వలేదు శ్రీ పాత్ర. ప్రకాష్ రాజ్ తన పాత్రను అలవోకగా చేసుకెళ్లిపోయారు. కానీ ఆయన రొటీన్ గానే అనిపిస్తారు. రాజేంద్రప్రసాద్ పర్వాలేదు. ఆయనకు పెద్దగా స్కోప్ లేదు. నరేష్.. ఆమనిలకు అసలేమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర ఇచ్చారు. నందిత శ్వేతను కూడా సరిగా వాడుకోలేకపోయారు. ఆమె లుక్ కూడా బాగాలేదు. ప్రవీణ్.. విద్యుల్లేఖ కొంత మేర నవ్వించారు. జయసుధ బాగా చేసింది. సితార పర్వాలేదు.  

సాంకేతికవర్గం:

మిక్కీ జే మేయర్ సంగీతం ఓ మోస్తరుగానే సాగింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్.. పెళ్లి పాట బాగున్నాయి. పాటలు ఇంకా బాగుండాల్సిందనిపిస్తుంది. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. విజువల్స్ ఆద్యంతం కలర్ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యంలో సాగే ద్వితీయార్దమంతా కనువిందు చేస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. భారీ తారాగణం.. మంచి లొకేషన్లు.. అందమైన సెట్టింగ్స్ తో ఎక్కడా రాజీ లేకుండా సినిమాను నిర్మించాడు దిల్ రాజు. ఇక రచయిత.. దర్శకుడు సతీశ్ నిరాశ పరిచాడు. అతను ‘శతమానం భవతి’ ఛాయల నుంచి బయటికి రాలేదనిపిస్తుంది. పెళ్లి కాన్సెప్ట్ తీసుకుని.. తన గత సినిమా టెంప్లేట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈసారి వినోదం మీద పెద్దగా దృష్టిపెట్టలేదు. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సన్నివేశాలు.. డైలాగులు రాసుకుని ఆ వర్గం వాళ్లను మాత్రమే మెప్పించగలిగాడు. అతను ఎంచుకున్న పాయింటే చాలా చిన్నదైపోయింది.

చివరగా: శ్రీనివాస కళ్యాణం.. కుటుంబ ప్రేక్షకులకు మాత్రమే

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre