Begin typing your search above and press return to search.

సచిన్..మహేష్ సినిమా చూడబోతున్నాడహో

By:  Tupaki Desk   |   28 Aug 2015 1:43 PM GMT
సచిన్..మహేష్ సినిమా చూడబోతున్నాడహో
X
ఒక మంచి కాన్సెప్టుతో సినిమా తీస్తే ఎంత అప్రిసియేషన్ వస్తుందో చెప్పడానికి ‘శ్రీమంతుడు’ సినిమానే నిదర్శనం. ఈ సినిమా రెగ్యులర్ ఆడియన్స్ ను మాత్రమే కాక.. ఎప్పుడూ సినిమాల్ని పట్టించుకోని వ్యక్తుల్ని కూడా స్పందింపజేస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రాజకీయ నాయకులు, వేరే రంగాల సెలబ్రెటీలు ఈ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. కొందరు ఈ సినిమా స్ఫూర్తితో గ్రామాల దత్తతకు ముందుకొచ్చారు. ఐతే తెలుగువాళ్లు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం.. ప్రశంసించడం మామూలే అనుకోవచ్చు కానీ.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ‘శ్రీమంతుడు’ మీద ఆసక్తి చూపడం విశేషం.

రాజ్యసభ సభ్యుడైన సచిన్ ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. దత్తత కాన్సెప్ట్ సచిన్ కు బాగా నచ్చి.. ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ‘శ్రీమంతుడు’ అదే కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా కావడంతో దాని గురించి చాముండీశ్వరి నాథ్ లాంటి వాళ్లెవరో అతడికి చెప్పారట. నిర్మాతలు సైతం సచిన్ తో మాట్లాడినట్లు తెలిసింది. సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పగా.. చూడ్డానికి ఆసక్తి చూపాడట. త్వరలోనే సచిన్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ‘శ్రీమంతుడు’ ముంబయిలోని కొన్ని థియేటర్లలో రిలీజైంది. అక్కడే ఏదో ఒకచోట సచిన్ కు షో ఏర్పాటు చేయొచ్చని సమాచారం. ఒకవేళ సచిన్ నిజంగానే ‘శ్రీమంతుడు’ చూస్తే అతను చూసిన తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.