ఈ వారానికి శ్రీకాంతే ‘రా..రా’జు

Mon Feb 19 2018 18:36:51 GMT+0530 (IST)

ఫిబ్రవరి రెండు వారాలు గడిచాయంటే సినిమాలకు అన్ సీజన్ మొదలవుతుంది. కాస్త పేరున్న సినిమాల్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసించరు. సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ అంతా పరీక్షల హడావుడిలో మునిగిపోయి ఉంటారు. దీంతో కలెక్షన్లపై బాగా ప్రభావం కనిపిస్తుంది. థియేటర్లు వెలవెలబోతుంటాయి. మళ్లీ మార్చి నెలాఖరు వరకు సందడి కనిపించదు. ఈ సమయంలోనే చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోని చిన్నా చితకా సినిమాలను వదిలేస్తుంటారు. రాబోయే మూణ్నాలుగు వారాల్లో అలాంటి  సినిమాలే రిలీజయ్యేలా కనిపిస్తున్నాయి.లాస్ట్ వీకెండ్లో ‘అ!’.. ‘మనసుకు నచ్చింది’ లాంటి కొంచెం పేరున్న సినిమాలే రిలీజయ్యాయి. కానీ వచ్చే వారాంతంలో మాత్రం ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ లేదు. చివరికి చాన్నాళ్లుగా విడుదల కోసం చూస్తున్న శ్రీకాంత్ సినిమా ‘రా..రా’నే కాస్త చెప్పుకోదగ్గ రిలీజ్ లాగా అనిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ బిజినెస్ జరగక.. రిలీజ్ డేట్ దొరక్క అలా ఆపి ఉంచారు. చివరికిప్పుడు రిలీజ్ చేసేయాలని ఫిక్సయ్యారు. ఈ చిత్ర పోస్టర్లపై దర్శకుడి పేరు కూడా కనిపించడం లేదు. శంకర్ అనే దర్శకుడు రూపొంచినట్లు చెబుతున్నారు కానీ.. అతడితో ఏమైనా తేడా వచ్చిందో ఏమో.. పోస్టర్ మీద మాత్రం పేరు లేదు. చిత్ర నిర్మాణ సంస్థ యూనిట్టే దీన్ని డైరెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. సినిమాలో కూడా టైటిల్స్లో అలాగే పడుతుందట. దీని ట్రైలర్ చూస్తే సగటు హార్రర్ సినిమాలాగే అనిపిస్తోంది. మరి పోటీ లేకుండా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న శ్రీకాంత్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.