Begin typing your search above and press return to search.

రియ‌ల్ స్టార్ వార‌సుడొస్తున్నాడు

By:  Tupaki Desk   |   21 May 2019 9:42 AM GMT
రియ‌ల్ స్టార్ వార‌సుడొస్తున్నాడు
X
న‌ట‌వార‌సుల వెల్లువ కొన‌సాగుతున్న త‌రుణ‌మిది. టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ న‌ట‌వార‌సులు అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. ఆ కోవ‌లోనే టాలీవుడ్ రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి వార‌సుడి రాక‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైంద‌ని తెలుస్తోంది. శ్రీ‌హ‌రి- శాంతి దంప‌తుల పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీ‌హ‌రి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. `రాజ్ దూత్` అనేది ఈ సినిమా టైటిల్. యువ‌త‌రం మెచ్చే రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ ఇది. షూటింగ్ పూర్తయింది. కార్తీక్- అర్జున్ ద‌ర్శ‌క‌ద్వ‌యం ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం చిత్ర‌యూనిట్ మీడియా ముందుకు రానుంద‌ని తెలుస్తోంది.

రెండు ద‌శాబ్ధాల పాటు రియ‌ల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన‌ శ్రీ‌హ‌రి స‌డెన్ డెత్ ఆ కుటుంబానికి పెద్ద షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. `వీకెండ్ ల‌వ్` (2013) అనే చిత్రంలో న‌టిస్తుండ‌గా శ్రీ‌హ‌రి ఆక‌స్మికంగా మృతి చెందారు. అప్ప‌టికి అత‌డి భార్య శాంతి ఆరోగ్యం అంతంత మాత్ర‌మే. పెద్ద కుమారుడు మేఘాంశ్ ఇంకా స్కూల్ కిడ్ కావ‌డంతో అత‌డి కెరియ‌ర్ గురించిన ప్ర‌స్థావ‌న కూడా లేదు. అయితే శ్రీ‌హ‌రిని అభిమానించే ఫిలింమేక‌ర్స్(ద‌ర్శ‌క‌నిర్మాత‌లు) ఇండ‌స్ట్రీలో ఎంద‌రో ఉన్నారు. అలాగే 24శాఖ‌ల్లో.. ఫైట‌ర్ల‌లో ఎంద‌రో శ్రీ‌హ‌రికి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లంద‌రి అండా ఇప్పుడు శ్రీ‌హ‌రి వార‌సుల‌కు ఉండ‌నుంద‌ని చెబుతున్నారు.

న‌టుడిగా కొన‌సాగినంత కాలం శ్రీ‌హ‌రి ఛ‌రిష్మా అసాధార‌ణం. అత‌డిని ఒక హీరోగా కంటే ఒక మాన‌వ‌తావాదిగానే స‌న్నిహితులు చూసేవారు. అడిగితే ఆప‌ద‌లో ఆదుకునే గొప్ప గుణం ... ఆప‌న్నుల‌కు అన్నం పెట్టే గొప్ప మ‌న‌సున్న మారాజు శ్రీ‌హ‌రి అని ప్ర‌శంసించేవారు. జ‌ర్న‌లిస్టులకు ఆయ‌నంటే ప్రేమాభిమానం.. గౌర‌వం అంతే ఇదిగా ఉండేది. అందుకే శ్రీ‌హ‌రి వార‌సుడు హీరో అవుతున్నాడు అన‌గానే .. అత‌డు పెద్ద స్టార్ అవ్వాలని అంతా మ‌న‌స్ఫూర్తిగా ధీవిస్తున్నారు. రియ‌ల్ స్టార్ కి మేఘాంశ్ .. శశాంక్ ఇద్ద‌రు పుత్రులున్నారు. ఆ ఇద్ద‌రూ ఈ రంగంలోనే కెరియ‌ర్ ని సాగిస్తార‌ని తెలుస్తోంది. ఇక రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి రేంజులో కుమారులు రాణిస్తారా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెబుతుంది.