ఆ రెస్టారెంట్ లో శ్రీదేవి బొమ్మ ఎందుకంటే?

Sun Feb 25 2018 09:49:55 GMT+0530 (IST)

దశాబ్దాల తరబడి ఒక వ్యక్తి అతిలోక సుందరిగా కోట్లాది మంది మనసుల్లో నిలవటం సాధ్యమా? అన్న ప్రశ్న వేస్తే నో అంటే నో అనేస్తారు. అలాంటి వారికి నటి శ్రీదేవి పేరు చెప్పినంతనే.. తమ మాటను వెనక్కి తీసుకుంటారు. శ్రీదేవి స్పెషాలిటీ ఏమిటని చెప్పటానికి ఇంతకు మించిన ఉదాహరణ మరేమీ ఉండదు.భారత చిత్రపరిశ్రమలో సినీనటీమణులు చాలామందే ఉన్నారు. కానీ.. దశాబ్దాల తరబడి తానో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటీమణులు ఎవరూ ఉండరనే చెప్పాలి. ఐదు దశాబ్దాలుగా ఆమె పేరు సిని ప్రియులకు సుపరిచితమని చెప్పాలి. శ్రీదేవి సినీ కెరీర్ లాంటి లాంగ్ జర్నీ చాలామంది నటీమణులకు ఉండి ఉండొచ్చు. కానీ.. ఆమెకున్న క్రేజ్ మాత్రం ఆమెకు మాత్రమే సొంతమని చెప్పాలి. అలాంటి అతిలోక సుందరి కోట్లాది మందికి కన్నీళ్లు తెప్పిస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆందానికి మారుపేరుగా దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఆమె నిలిచారని చెప్పాలి. ఆమె క్రేజ్ ఎంతంటే.. సింగపూర్ లోని ఒక హోటల్ యాజమాన్యం అయితే శ్రీదేవి పింగాణి బొమ్మను తయారు చేసి తమ రెస్టారెంట్లో పెట్టుకుంది. సింగపూర్ లో ఢిల్లీ రెస్టారెంట్ అన్న పేరుతో ఒక హోటల్ ఉంది. అందులోకి అడుగు పెట్టిన ప్రతిఒక్కరికి ఒక బొమ్మ విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారతీయులైతే.. ఎక్కడో చూసినట్లుందే అనిపించి.. మన శ్రీదేవిలా ఉందే అన్న భావనకు గురి అవుతారు.కానీ.. అది నిజంగానే శ్రీదేవి బొమ్మే.

శ్రీదేవి గురించి.. ఆమె నటకౌశలం.. అందం గురించి విన్న హోటల్ యాజమాన్యం ఆమె బొమ్మను ప్రత్యేకంగా తమ రెస్టారెంట్లో ఏర్పాటు చేసింది. ఈ బొమ్మ కింద శ్రీదేవి గొప్పతనం గురించి వివరిస్తూ కొంత సమాచారాన్ని ఉంచారు. భారత సంప్రదాయాన్ని గుర్తు చేసేలా చీరకట్టు.. ఒంటినిండా నగలు ధరించిన శ్రీదేవి బొమ్మ విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీదేవి బొమ్మను ఏర్పాటు చేయటం ద్వారా ఈ రెస్టారెంట్ పాపులార్టీ సంపాదించటమే కాదు.. భారతీయులు పలువురు ఈ రెస్టారెంట్ ను సందర్శిస్తుంటారు.