Begin typing your search above and press return to search.

అతిలోక సుందరి కుళ్లి కుళ్లి ఏడవాల్సిందే

By:  Tupaki Desk   |   3 Oct 2015 5:30 PM GMT
అతిలోక సుందరి కుళ్లి కుళ్లి ఏడవాల్సిందే
X
తనకిలాంటి అనుభవం ఎదురవుతుందని పాపం శ్రేదేవి అస్సలు ఊహించి ఉండదేమో. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ లాంటి మంచి సినిమాతో బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రేదేవి.. సౌత్ సినిమాల విషయంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు. అసలే బాహుబలి సినిమాను వదులుకోవడం గురించి ఆమె బాధ చెప్పనలవి కాకుండా ఉంది.

తాను కాలదన్నుకున్న బాహుబలి సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన పేరు చూసి అతిలోక సుందరికి దిమ్మదిరిగిపోయింది. శివగామి క్యారెక్టరుతో రమ్యకృష్ణ పేరు బాలీవుడ్ లోనూ మార్మోగిపోయింది. బాహుబలి పేరెత్తడానికి కూడా ఇష్టపడనంతగా ఈ సినిమా శ్రీదేవిని ఫ్రస్టేషన్ కు గురిచేసింది. అయ్యిందేదో అయ్యిందిలే బాహుబలిని కాదని ఎంచుకున్న పులి సినిమా హిట్టయితే అదే ఆనందం అనుకుంది శ్రీదేవి.

కానీ ‘పులి’ దారుణమైన ఫలితాన్నిచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అయింది. హిందీలో అయితే ఆ సినిమాను పట్టించుకునే నాథుడు లేడు. సినిమా చూసిన వాళ్లు కూడా శ్రీదేవి క్యారెక్టర్ గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. ఆమె గెటప్, నటన అన్నీ కృతకంగా ఉన్నాయంటున్నారు. ఇలాంటి సినిమా కోసమా.. బాహుబలిని వదిలేసింది అంటూ శ్రీదేవిని తేలిగ్గా మాట్లాడుతున్నారు. శ్రీదేవి వీరాభిమాని రాంగోపాల్ వర్మ కూడా పులి సినిమాలో శ్రీదేవి పాత్రను చూసి చాలా బాధ పడిపోయాడు. ఓ అభిమానిగా ఆమె ఇలాంటి పాత్ర చేసినందుకు బాధగా ఉందన్నాడు. వర్మకే ఇంత బాధ ఉంటే.. ఇక శ్రీదేవి బాధ ఇంకెలా ఉంటుందో. బాహుబలిని వదులుకున్న బాధ శ్రీదేవికి ఎప్పటికీ వదిలిపోదేమో.