శ్రీరెడ్డి పవన్ సలహాను పాటించింది కానీ..

Sun Apr 15 2018 13:17:29 GMT+0530 (IST)

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సలహాను పాటించింది. ఆయన సూచన ప్రకారమే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనపై కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్న కరాటె కళ్యాణి.. సత్య చౌదరిల మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వీళ్లిద్దరిపై ఆమె ఫిర్యాదు చేసింది.దగ్గుబాటి అభిరామ్.. కోన వెంకట్ తదితరులపై శ్రీరెడ్డి కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనను అవకాశాల పేరుతో సినీ పరిశ్రమలో చాలామంది వంచించారని.. తెలుగు నటీనటులకు అవకాశాలివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆమె అంటోంది. కొన్ని రోజుల కిందట ‘మా’ కార్యాలయం ఎదుట ఆమె అర్ధనగ్నంగా నిరసన కూడా వ్యక్తం చేసింది.

ఐతే ఇలా రోడ్డెక్కడం వల్ల.. టీవీ ఛానెళ్లలో కూర్చుని డిస్కషన్లు చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. దాని బదులు చట్టబద్ధమైన సంస్థల్ని నమ్ముకోవాలని.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు అన్యాయం చేసిన వాళ్లపై ఫిర్యాదు చేయాలని పవన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారమే శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కాకపోతే ఆమె అభిరామ్ మీదో.. కోన మీదో ఫిర్యాదు చేయలేదు. ఈ ఇష్యూకు సంబంధించి తనను తీవ్రంగా దూషిస్తూ.. ఆరోపణలు చేసిన కళ్యాణి.. సత్య చౌదరిల మీద చర్యలు చేపట్టాలని ఆమె ఫిర్యాదు చేసింది.