అలా జరిగితే ఆ పేర్లన్నీ లైవ్ లో వస్తాయి: శ్రీరెడ్డి

Tue Apr 10 2018 15:10:29 GMT+0530 (IST)


టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా - తెలుగు నటీమణులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుతూ తాను చేస్తోన్న పోరాటం ఆగదని నటి శ్రీరెడ్డి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతానని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. తన పోరాటాన్ని ఆపేయాలని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని - అయినా భయపడనని - కనీసం తన ఫోన్ నంబర్ కూడా మార్చనని తెగేసి చెప్పింది. తాజాగా - శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో సంచలన వీడియోను పోస్ట్ చేసింది. తను చేసే పోరాటంలో తనకు ప్రాణహాని ఉందని - ఒకవేళ తనకేమైనా జరిగితే తన దగ్గరున్న బడాబాబుల పేర్లు ఓ తెలుగు మీడియా చానెల్ లో ప్రసారమవుతాయని వార్నింగ్ ఇచ్చింది. తనదగ్గరున్న సాక్ష్యాధారాలు ఆ న్యూస్ చానెల్ కు అందించిన తర్వాతే తన పోరాటం మొదలుపెట్టానని తెలిపింది. తనకు మద్దతుగా నిలిచిన జాతీయ - అంతర్జాతీయ మీడియాలకు కృతజ్ఞతలు తెలిపింది. న్యూయార్క్ టైమ్స్ లో తనపై వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసింది. జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో తన గురించి చర్చ జరుగుతోన్న - ఇప్పటి దాకా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు - రాజకీయ నేతలు స్పందించలేదని తెలిపింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తన పోరాటానికి మీడియా ఓ స్టేజ్ క్రియేట్ చేసిందని - తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న మీడియాపై నిందలేయడం సరికాదని తెలిపింది. తాను చేస్తున్న పోరాటానికి ఒక మీడియా సంస్థగా మాత్రమే ఆ చానెల్ మద్దతిచ్చిందని అంతమాత్రాన ఆ చానెల్ యాంకర్ - తన గురించి అసభ్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని శ్రీరెడ్డి ప్రశ్నించింది. తనకు ఆ యాంకర్ కు సంబంధం అంటగట్టిన వారంతా తమ తమ ఇళ్లకు అంటగట్టినట్టేనని మండిపడింది. మంటకు మురికి అంటించడానికి ట్రై చేస్తే చేతులు కాలుతాయని ఆ యాంకర్ లైఫ్ నిజాయితీకి అంకితమని చెప్పింది. రంకు భాగోతాలతో బ్రతికేవారికి లోకమంతా అలాగే కనిపిస్తుందని - మంచి కళ్లతో మంచిని చూడాలని కోరింది. తాను టీడీపీ తరఫున మాట్లాడుతున్నానని - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని విమర్శలు వస్తున్నాయని - తనకు రాజకీయాలకు సంబంధం లేదని - తాను ఏ పార్టీకి చెందిన దానిని కాదని తెలిపింది. రెండున్నరేళ్ల పాటు సాక్షి టీవీ ఉప్పు తిన్నానని - కష్టకాలంలో ఆదుకొని తనకు అన్నం పెట్టిన చానెల్ యాజమాన్యాన్ని అపఖ్యాతి పాలు చేసేంతటి దరిద్రురాలిని కాదని చెప్పింది. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ లాలూచీ పడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇండస్ట్రీలో కొన్ని వందల మంది అమ్మాయిల మానాలు పోతున్నాయని వారికి అండగా నిలవడడం కోసమే తాను పోరాడుతున్నానని స్పష్టం చేసింది.