పవన్ అంత బూతు మాట్లాడేశాడా?

Tue Apr 17 2018 12:48:07 GMT+0530 (IST)

నిన్నటిదాకా ఒక లెక్క.. ఈ రోజు నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంది శ్రీరెడ్డి వ్యవహారం. మొదట్లో ఆమె టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి ఆమె ఆరోపణలు చేసినపుడు జనాలు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె చేసిన అర్ధనగ్న నిరసన చూసేవాళ్లందరికీ చాలా ఇబ్బంది కలిగించింది. అంతటితో ఆమె కథ ముగిసినట్లే అనుకున్నారు కానీ.. ఆ తర్వాత దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరాంతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్ చేయడం.. మరికొందరిపై ఆరోపణలు చేయడం ద్వారా మళ్లీ ఆమెకు టీవీ ఛానెళ్లలో మంచి ప్రాధాన్యం దక్కింది. ఇంతలోనే ఆమెకు మహిళా సంఘాల నేతలు.. జూనియర్ ఆర్టిస్టుల మద్దతు కూడా లభించింది. శ్రీరెడ్డి కూడా కొంచెం నోటి దురుసు తగ్గించుకుని పద్ధతిగా మాట్లాడటంతో ఆమె పోరాటం సరైన దిశలోనే సాగుతోందని అంతా అనుకున్నారు.కానీ నిన్న పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలతో కథ మారిపోయింది. ఇప్పుడు ఆమెపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పవన్ శ్రీరెడ్డి విషయంలో తప్పుగా ఏమీ మాట్లాడలేదు. ఎంతసేపూ టీవీ ఛానెళ్లలో కూర్చుని డిబేట్లు పెడితే లాభం లేదని.. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడ న్యాయం జరగకపోతే తర్వాత ఏమైనా చేయాలని సలహా ఇచ్చాడు. ఇందులో తప్పేముంది..? దీనికి అంత ఆగ్రహం ఎందుకు? ఈ మాత్రానికే పవన్ ను అన్న అనడమే తప్పయిందని.. ఆయన్ని ఎవరూ అన్న అనొద్దని.. ఓటేయొద్దని అనాలా? మరీ దారుణంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో అనే బూతు మాటను ప్రయోగించాల్సిన అవసరముందా? అసలు ముందు పవన్ వ్యాఖ్యల మీద ఫేస్ బుక్ లో మామూలుగానే స్పందించిన శ్రీరెడ్డి.. ఒక్క రోజులో ఎందుకు స్వరం పెంచింది..? అన్నేసి మాటలు ఎందుకు అన్నది..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరూ వెనుక ఉండి చేయిస్తున్నారన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించేవాళ్లు సైతం శ్రీరెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. ఇక పవన్ అభిమానుల సంగతి చెప్పేదేముంది? తమ ఆరాధ్య కథానాయకుడి తప్పు లేకుండా అంత మాట అంట వాళ్లు ఎంతగా రగిలిపోతుంటారో చెప్పేదేముంది..? తనకు ఊహించని మద్దతు లభిస్తున్న సమయంలో శ్రీరెడ్డి ఆ మాట అనడం ద్వారా జీరో అయిపోయిందనే చెప్పాలి.