కేతిరెడ్డి సంచలనం!.. లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డేనట!

Mon Feb 18 2019 16:44:58 GMT+0530 (IST)

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఈ రెండింటిలో ఓ బయోపిక్ కు సంబంధించిన సిరీస్ లోని తొలి భాగం విడుదలైపోయింది. అట్టర్ ప్లాఫ్ గా ముగిసింది. ఇక రెండో పార్ట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన ఈ సిరీస్ కు పోటీగా బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ *లక్ష్మీస్ ఎన్టీఆర్* పేరిట మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రెండింటికీ కాస్తంత డిఫరెంట్ గా తానూ ఓ బయోపిక్ తీస్తానంటూ తమిళనాడులో తెలుగు హక్కుల కోసం పోరాటం చేస్తున్న కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మొన్నామధ్య  సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ...కేతిరెడ్డి సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా మళ్లీ ఆయన తెర ముందుకు వచ్చారు. *లక్ష్మీస్ వీరగ్రంథం* పేరిట తాను తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మీపార్వతి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని వెల్లడించి సంచలనం రేపారు. ఇంతకూ ఈ సినిమాలో లక్ష్మీపార్వతిగా కనిపించే నటి ఎవరన్న విషయానికి వస్తే... టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కు నిరసనగా నడిరోడ్డుపై దుస్తులు విప్పి వినూత్న నిరసనకు దిగిన శ్రీరెడ్డి ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో నటిస్తున్నారని కేతిరెడ్డి చెప్పారు.

ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. ఇప్పటికే శ్రీరెడ్డి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అయితే స్టోరీ మాత్రమే తాము ఆమె చెప్పామని కేతిరెడ్డి చెప్పారు. త్వరలోనే సెట్స్ మీదకు ఈ సినిమాను తీసుకొస్తామని - ఇక స్టోరీని సీన్స్ రూపంలో శ్రీరెడ్డికి వినిపిస్తామని - ఇదంతా విన్న తర్వాత ఆమె ఏమంటుందోనన్న అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ సినిమాలో విలన్ లక్ష్మీపార్వతినేనని - ఈ కారణంగా ఈ పాత్రకు సంబంధించిన సీన్స్‌ను విన్న తర్వాత శ్రీరెడ్డి ఏమంటుందోనన్న అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైతే... తన సినిమాలో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డినే అనుకుంటున్నానని కూడా ఆయన చెప్పారు.