Begin typing your search above and press return to search.

నాగ్-నాని ఒరిజినల్ అంటున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   23 May 2018 4:20 AM GMT
నాగ్-నాని ఒరిజినల్ అంటున్న డైరెక్టర్
X
కింగ్ అక్కినేని నాగార్జున-నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘భలే మంచి రోజు’.. ‘శమంతక మణి’ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి మొదట్నుంచి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముందు ఇదొక హాలీవుడ్ మూవీకి రీమేక్ అన్నారు. ఆ తర్వాత పదేళ్ల కిందట బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘జానీ గద్దర్’ ఆధారంగా ఇది తెరకెక్కుతోందని వార్తలొచ్చాయి. తాజా రూమర్ విషయంలో చిత్ర బృందం సైలెంటుగా ఉండటంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడీ ఊహాగానాల్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఖండించాడు.

నాగ్-నాని సినిమా ఏ చిత్రానికీ రీమేక్ కాదని.. ఇది తన సొంత కథతో తెరకెక్కుతున్న సినిమా అని.. ఇక ఊహాగానాలన్నీ కట్టిపెట్టాలని కోరాడు. తన సినిమా విషయంలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుండటంతో శ్రీరామ్ ఓపెన్ అవ్వక తప్పలేదు. కాబట్టి ఇక అందరూ సైలెంటైపోవచ్చు. ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా.. నాని డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో ‘మళ్ళీరావా’ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ నాగ్ సరసన నటిస్తోంది. నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందాన్న కనిపిస్తుంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్నందిస్తాడు. ఇప్పటికే సగం దాకా చిత్రీకరణ పూర్తయిందంటున్నారు. ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.