Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు యాక్సిడెంట్..ఆ రోజు ఏమైంది?

By:  Tupaki Desk   |   26 Nov 2016 7:08 AM GMT
ఎన్టీఆర్ కు యాక్సిడెంట్..ఆ రోజు ఏమైంది?
X
2009 ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ వస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద యాక్సిడెంట్ కావడం.. ఓ మోస్తరు గాయాలతో అతను బయటపడటం తెలిసిన సంగతే. ఆ యాక్సిడెంట్ జరిగినపుడు తారక్ వెంట వస్తున్న వాళ్లలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. ఐతే ఆ ప్రమాదం అనంతరం ఎన్టీఆర్ కు.. శ్రీనివాసరెడ్డికి గ్యాప్ వచ్చిందట. అందుకు కారణమేంటో.. అసలు ఆ రోజు ఏం జరిగిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు శ్రీనివాసరెడ్డి.

‘‘తారక్ తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నేను.. తను.. రాజీవ్ కనకాల కలిసి క్రికెట్ ఆడేవాళ్లు. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ తో పాటు ఉన్న బ్యాచ్ లో నేనూ ఉన్నాను. నేను ఖమ్మం సభకు వాళ్లతో కలిశాను. సభ అయ్యాక కార్లలో హైదరాబాద్‌ బయల్దేరాం. ముందు కార్లో ఎన్టీఆర్.. మరికొందరు స్నేహితులు బయల్దేరారు. మేం వెనుక కార్లో ఉణ్నాం. కొంతదూరం వెళ్లాకక ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయింది. మేం కారు దగ్గరికెళ్లి చూస్తే అందులో ఎన్టీఆర్ లేడు. పక్కన బాగా దుమ్ముపట్టిన బట్టలతో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నాడు. ఏంటన్నా అంటే.. రక్తం వస్తోందంటూ తల భాగం చూపించాడు. బ్యాగులో ఉణ్న టవల్ తీసి తలకు చుట్టేసి మా కార్లో ఎక్కించాం.

సూర్యాపేటలో మా అక్కవాళ్లుంటారు. వాళ్లకు ఫోన్ చేసి ఏ హాస్పిటల్ బాగుంటుందో అడిగి తెలుసుకున్నా. అక్కడికెళ్లి ఆసుపత్రిని రౌండప్ చేశాం. పేషెంట్స్ తప్ప ఎవరూ లేకుండా చేశాం. తారక్‌ కు కుట్లు వేయడానికి డాక్టర్ చేతులు వణికాయి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ కిమ్స్‌ కు తీసుకొచ్చారు. ఐతే అక్కడున్న మా బ్యాచ్ లో ఒకడు నేను అడుగుపెట్టడం వల్లే యాక్సిడెంట్ అయింది అన్నాడు. చాలా బాధనిపించి వెంటనే రిటార్ట్‌ ఇచ్చాను. నేను ఉన్నాను కాబట్టే ప్రాణాలతో బయటపడ్డాడని.. లేకపోతే ఇంకేమయ్యేదో అని అన్నాను. ఐతే ఆ మాటను మరో రకంగా అర్థం చేసుకుని వేరే వాళ్లు ఎన్టీఆర్ కు చెప్పారనుకుంటా. అప్పట్నుంచి మా మధ్య గ్యాప్‌ వచ్చింది. ఇన్నేళ్లుగా ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఏదో ఒక రోజు ఎన్టీఆర్‌ ను కలిసి మాట్లాడి ఈ గ్యాప్ తగ్గిస్తా’’ అని శ్రీనివాసరెడ్డి చెప్పాడు.