సినిమా అర్థం కాక పిచ్చెక్కుతుంది: శ్రీవిష్ణు

Thu Jul 12 2018 12:40:52 GMT+0530 (IST)

సుధీర్ బాబు - నారా రోహిత్ - శ్రీవిష్ణు హీరోలుగా శ్రియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వీరభోగ వసంత రాయలు’. ఆర్ ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నారు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు.   ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో  ఈ చిత్ర నటుల్లో ఒకరైన శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి పనిచేసిన టీం ఈ చిత్రానికి చేస్తోంది. ఆ సినిమా వంద సినిమాల్లో వచ్చే ఒక సినిమా కాదు.. వెయ్యి సినిమాల్లో వచ్చే సినిమా.. అదే విధంగా ‘వీరభోగ వసంత రాయులు ’ లాంటి సినిమా మళ్లీ రావాలంటే అది ఈ దర్శకుడు ఇంద్రసేన తీస్తేనే సాధ్యమవుతుంది’ అని చిత్రం గురించి గొప్పగా చెప్పారు.  

‘నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు సినిమా పోస్టర్ లో ఉన్నట్టు ఫీలయ్యా..   సినిమా  చూసిన ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతున్నారు.  మొదట సినిమా అర్థం అవ్వదు.. డౌట్ లేకుండా చెబుతున్నాను.. ఇది పిచ్చెక్కి పోయే సినిమా’ అని శ్రీవిష్ణు వ్యాఖ్యానించారు.

టీజర్ - ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఏంటనేది మీకు అర్థమవుతుందని శ్రీవిష్ణు తెలిపారు. ‘ఈ సినిమాలో చాలా మంది స్టార్లు ఉన్నారు. కానీ ఈ సినిమాకు హీరో స్క్రీన్ ప్లే.. హీరోయిన్ స్టోరీ. డైరెక్టర్ ఇంద్ర చాలా మంచోడు.. కానీ ఈ సినిమాకు నన్ను చాలా టార్చర్ పెట్టాడు. సినిమాల్లోకి వచ్చి ఇన్నాళ్లు పడిన కష్టం కంటే.. ఎక్కువ కష్టం ఈ సినిమాకే పడ్డాను. కానీ సినిమా ఔట్ పుట్ చూశాక చాలా సంతోషం వేసింది ’ అని శ్రీవిష్ణు తన అనుభవాలను వివరించాడు.  

నారా రోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో హీరో అని ఎవరూ లేరు.. సినిమాల్లోని ప్రతి క్యారెక్టర్ హీరోనే.. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదని ఖచ్చితంగా చెప్పగలను’ అన్నారు.