Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'స్పైడర్ '

By:  Tupaki Desk   |   27 Sep 2017 8:21 AM GMT
మూవీ రివ్యూ : స్పైడర్
X
చిత్రం : ‘స్పైడర్’

నటీనటులు: మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ - ఎస్.జె.సూర్య - భరత్ - ప్రియదర్శి - షాయాజి షిండే - ఆర్జే బాలాజీ - దీపా రామానుజం తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్ - ఠాగూర్ మధు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మురుగదాస్

సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన మహేష్ బాబు.. బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. వీళ్ల కలయికలో తెరకెక్కిన ‘స్పైడర్’కు మామూలు హైప్ రాలేదు. భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి దిగింది ‘స్పైడర్’. మరి ఆ అంచనాల్ని ఈ సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

శివ (మహేష్ బాబు) ఇంటలిజెన్స్ బ్యూరోలో ఫోన్ డేటా సర్వేలెన్స్ నిపుణుడిగా పని చేస్తుంటాడు. తన క్వాలిఫికేషన్ కి ఇంకా మంచి ఉద్యోగం - డబ్బు సంపాదించే అవకాశమున్నప్పటికీ శివ మాత్రం ఈ ఉద్యోగాన్నే ఇష్టపడతాడు. ఫోన్ డేటాను అనలైజ్ చేయడం ద్వారా కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడం ద్వారా అతను సంతృప్తి పొందుతుండటమే ఇందుక్కారణం. ఐతే శివకు వచ్చిన ఒక ఫోన్ కాల్ తో అతడి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. పైశాచికంగా హత్యలు చేస్తున్న భైరవుడు (ఎస్.జె.సూర్య) అనే సైకో కిల్లర్ గురించి తెలుసుకున్న శివ.. అతడి గుట్టును బయటికి లాగుతాడు. భైరవుడి తమ్ముడిని కూడా చంపేస్తాడు. దీంతో భైరవుడు శివను లక్ష్యంగా చేసుకుంటాడు. మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తాడు. మరి అతడిని శివ ఎలా అడ్డుకున్నాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఒక స్టార్ హీరో సినిమా అనగానే.. ఫోకస్ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. హీరో క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. అతడి నేపథ్యం చూపిస్తారు. అతడి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ క్యారెకర్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. హీరో ప్రత్యేకతల్ని చూపిస్తూ కథను నడిపిస్తారు. ఐతే ‘స్పైడర్’లో మాత్రం ఈ ప్రత్యేకతలన్నీ విలన్ పాత్ర విషయంలో చూపించాడు మురుగదాస్. ‘స్పైడర్’లో చెప్పుకోదగ్గ అతి పెద్ద విశేషం కూడా ఎస్.జె.సూర్య పోషించిన సైకో కిల్లర్ పాత్రే. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర కూడా అంత బాగా ఎలివేట్ అవుతుందని.. కథాకథనాలు కూడా అంత పకడ్బందీగా తయారవుతాయని ‘తుపాకి’ సినిమాతో రుజువు చేసిన మురుగదాస్... ‘స్పైడర్’ విషయంలోనూ అదే ఎత్తుగడను అనుసరించాడు.

ఐతే విలన్ పాత్ర తాలూకు నేపథ్యాన్ని చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్ది.. అతణ్ని తొలిసారి ప్రేక్షకులకు పరిచయం చేసే సన్నివేశంతోనే ఒక రకమైన ఉద్వేగం తీసుకొచ్చి.. కథను ఒక రసవత్తరమైన మలుపులో నిలబెట్టినపుడు.. ఆ తర్వాత హీరో-విలన్ మధ్య పోరులో ఇంకెంత మజా ఉంటుందో అని ఆశిస్తాం. ‘స్పైడర్’ ఈ విషయంలో అంచనాల్ని అందుకోదు. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులు అనుకున్నంత రసవత్తరంగా లేకపోవడం.. ఈ ఎపిసోడ్లలో ఒకింత సాగతీత.. ‘స్పైడర్’ గ్రాఫ్ పడిపోయేలా చేస్తాయి. మొత్తంగా కథే ప్రధానంగా సాగుతూ ఓ దశ వరకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే ‘స్పైడర్’.. తర్వాత ట్రాక్ తప్పి చివరికి మామూలుగా సినిమాలా ముగుస్తుంది. కథ మలుపు తీసుకునే దగ్గర చూపించిన ఇంటెన్సిటీని మురుగదాస్ ఆ తర్వాత కూడా కొనసాగించి ఉంటే.. ‘స్పైడర్’ స్థాయే వేరుగా ఉండేది. అది లేకపోవడం వల్ల జస్ట్ ఓకే అనిపిస్తుందంతే.

సామాజికాంశాల్ని నేపథ్యంగా చేసుకుని కమర్షియల్ హంగులు కూడా మిస్సవ్వకుండా పకడ్బందీగా సినిమాలు తీయడంలో మురుగదాస్ శైలే వేరు. ‘స్పైడర్’ను కూడా అదే తరహాలో నడిపించే ప్రయత్నం చేశాడు. మనుషుల్ని చంపి పడేసి.. ఆ శవాల దగ్గర పడి ఏడ్చే జనాల్ని చూసి పైశాచికానందం పొందే విలన్ పని పట్టే సూపర్ హీరో కథ ఇది. ఇంతకుముందు చాలా సైకో క్యారెక్టర్లను చూసి ఉంటాం. వాటన్నింటికీ భిన్నంగా కనిపిస్తుంది సూర్య పాత్ర. దాని నేపథ్యమే చాలా కొత్తగా అనిపిస్తుంది. విలన్ క్యారెక్టర్ని.. అతడి నేపథ్యాన్ని చూపించడంలో మురుగదాస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాకు ఆయువుపట్టు అనదగ్గ ఎపిసోడ్ ఇది. హీరో పాత్ర కంటే కూడా విలన్ పాత్రే ఆరంభం నుంచి ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ పాత్ర పరిచయం కావడానికి ముందు.. దాన్ని బిల్డ్ చేసిన తీరుకు మురుగదాస్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తన పరిచయ సన్నివేశంలో సూర్య కూడా అదిరిపోయే రేంజిలో పెర్ఫామ్ చేయడంతో ప్రేక్షకులు స్టన్ అయిపోతారంతే.

ప్రథమార్ధంలో ప్రేక్షకుల్ని అరెస్ట్ చేసేలా స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్న మురుగదాస్.. ద్వితీయార్ధంలో హీరో-విలన్ మధ్య ఎత్తుల పై ఎత్తుల నేపథ్యంలో కథనాన్ని అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ‘తుపాకి’ సినిమాలో హీరో తన టీంతో ఉగ్రవాద ముఠాను మట్టుబెట్టే ఎపిసోడ్ తరహాలో.. ఇక్కడ ఒక సెటప్ పెట్టుకున్నాడు మురుగదాస్. ఇందులో టీవీ సీరియళ్లు చూసే మహిళలతో హీరో ఆపరేషన్ నడిపిస్తాడు. ఓ దశ వరకు బాగానే నడుస్తున్న వ్యవహారం ఇక్కడే దారి తప్పుతుంది. ఇక్కడే మురుగదాస్ ‘తమిళ’ దర్శకుడన్న సంగతి గుర్తుకొస్తుంది. ఈ ఎపిసోడ్ అప్పటిదాకా సినిమాలో ఉన్న ఇంటెన్సిటీని తగ్గించేస్తుంది. హీరో-విలన్ తొలిసారి ఎదురుపడే సన్నివేశం ఇంటెన్స్ గా సాగి.. ముగింపుపై ఆశలు రేకెత్తిస్తుంది.

ఐతే మహేష్ బాబు సినిమా అన్నాక ఏదో ఒక ‘భారీతనం’ ఉండాలన్న ఉద్దేశంతో అనవసర ప్రయాసకు పోయారు. చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఆ సన్నివేశాల్లో కనిపిస్తుంది కానీ.. అవి ఎంతమేరకు ప్రేక్షకుల్ని రంజింపజేస్తాయన్నది సందేహమే. చాలావరకు ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ లాగా సాగే ‘స్పైడర్’కు ఇలాంటి ముగింపు అయితే అవసరం లేదనిపిస్తుంది. విషయ ప్రధానంగా సాగే ఇంటర్వెల్ ముందు సన్నివేశం ఇచ్చే ఫీలింగ్.. చివర్లో ఈ ‘భారీతనం’ నిండిన సీన్ చూస్తే కలిగే ఫీలింగ్ పూర్తి భిన్నంగా ఉంటాయి. మామూలుగా మురుగదాస్ తన సినిమాల్లో ఓవైపు కథను సీరియస్ గా నడిపిస్తూనే.. రిలీఫ్ కోసం రొమాంటిక్ ట్రాక్ పెడుతుంటాడు. ఐతే ‘స్పైడర్’లో ఈ ట్రాక్ ఏమంత రిలీఫ్ ఇవ్వలేకపోయింది. అది కూడా సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్సే. ఓవరాల్ గా చూస్తే.. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ స్థాయికి తగ్గట్లయితే ‘స్పైడర్’ లేదు. అలాగని ఇది తీసిపడేయదగ్గ సినిమా కూడా కాదు. మురుగదాస్.. మహేష్ కాకుండా మరో హీరోతో ఈ సినిమా చేయాల్సిందేమో అన్న భావన కలిగితే ఆశ్చర్యం లేదు.

నటీనటులు:

మహేష్ బాబు ఎప్పట్లాగే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. అతడి నటనకు వంక పెట్టడానికి లేదు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్బ్. అతడి లుక్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రే హైలైట్ అయ్యే ఇలాంటి కథకు మహేష్ ఓకే చెప్పడం అభినందనీయం. కానీ మహేష్ అభిమానులు ఆశించే స్థాయిలో అతడి పాత్ర.. ఇతర అంశాలు లేవు. హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి చెప్పడానికేమీ లేదు. ఆమె లుక్ కానీ.. పాత్ర కానీ.. తనతో ముడిపడ్డ సన్నివేశాలు కానీ ఏమంత ఆకట్టుకోవు. విలన్ ఎస్.జె.సూర్య మాత్రం అదరగొట్టేశాడు. ఈ పాత్రను అంత సులువుగా మరిచిపోలేం. సూర్యను తొలిసారి చూపించే సన్నివేశంలో అతడి హావభావాలు పిచ్చెక్కించేస్తాయి. సైకో లక్షణాల్ని అద్భుతంగా పలికించాడు. సినిమాలో మిగతా పాత్రలేవీ అంత ప్రత్యేకంగా అనిపించవు. భరత్.. ప్రియదర్శి.. దీపా రామానుజం.. జయప్రకాష్.. వీళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

సంగీతం విషయంలో ‘స్పైడర్’ నిరాశ పరుస్తుంది. హారిస్ జైరాజ్ పాటలు ఏమంత క్యాచీగా లేవు. సినిమాలో పాటల ప్లేస్మెంట్ కూడా సరిగా లేదు. కథకు పాటలు స్పీడ్ బ్రేకర్లలాగా అనిపిస్తాయి. సిసిలియా పాట ఒకటి కొంచెం పర్వాలేదనిపిస్తుంది. ఐతే హారిస్ నేపథ్య సంగీతం విషయంలో మాత్రం మెప్పించాడు. సినిమా అంతటా నేపథ్య సంగీతం ఒక ఇంటెన్సిటీతో సాగుతుంది. ‘స్పైడర్’ థీమ్ మ్యూజిక్.. విలన్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తాయి. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ఆకర్షణ. సినిమాకు ఒక రిచ్ లుక్ తీసుకొచ్చారాయన. రోలర్ కాస్టర్ సీన్లో సంతోష్ ప్రత్యేకత చూడొచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో పీటర్ హెయిన్ శ్రమ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ విషయంలో నిర్మాతలు ఎన్వీ ప్రసాద్.. ఠాగూర్ మధు ఎక్కడా రాజీ పడలేదు. ఐతే ‘బాహుబలి2 లాంటి సినిమాలు చూసిన కళ్లతో చూస్తే ఇందులోని గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ అంత ఎగ్జైట్ చేయవు. అవి ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. మురుగదాస్ తన మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గ ఔట్ పుట్ ఇవ్వలేకపోయాడు. ప్రథమార్ధం వరకు మెప్పించినా.. కొన్ని చోట్ల తన ముద్ర చూపించినా.. ఆ తర్వాత కథనాన్ని గ్రిప్పింగ్ గా నడిపించలేకపోయాడు. బోర్ కొట్టించాడు. లాజిక్స్ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. మహేష్ పాత్ర విషయంలో మురుగదాస్ నిరాశ పరిచాడు. మహేష్ స్థాయికి తగ్గ కథ ఇది కాదనిపిస్తుంది. మురుగదాస్ సినిమాల్లో ఎప్పుడూ ఉండే ఎంటర్టైన్మెంట్ ఇందులో మిస్సయింది.

చివరగా: స్పైడర్.. ఓకే అనిపిస్తుంది సగంలో దారి తప్పాడు!

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre