Begin typing your search above and press return to search.

‘భరత్ అను నేను’ చాలా ఈజీగా అనిపిస్తోందట

By:  Tupaki Desk   |   26 Sep 2017 7:27 AM GMT
‘భరత్ అను నేను’ చాలా ఈజీగా అనిపిస్తోందట
X
ఇన్నేళ్ల తన కెరీర్లో ‘స్పైడర్’ సినిమా కోసం పడ్డ కష్టం ఇక దేనికీ పడలేదని అంటున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన దగ్గర్నుంచి దీని కోసం పడ్డ కష్టం గురించి చాలా సార్లు మాట్లాడిన మహేష్.. రిలీజ్ ముంగిట కూడా దాని గురించే ప్రస్తావించాడు. ఈ సినిమా చేశాక ఇక ఎలాంటి సినిమా తేలికే అని తనకు అనిపిస్తోందని.. ‘స్పైడర్’ తర్వాత చేస్తున్న ‘భరత్ అను నేను’ సినిమా విషయంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోందని మహేష్ తెలిపాడు.

‘‘నాకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా వచ్చు. కాబట్టి ద్విభాషా చిత్రం అంటే పెద్ద కష్టం కాదని అనుకున్నా. ఒక భాషలో డైలాగ్ చెప్పి.. ఇంకో భాషలో మళ్లీ డైలాగ్ చెప్పడం అంతే కదా అనుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాతే తెలిసింది ఇందులో ఎంత కష్టం ఉందనేది. ద్విభాషా చిత్రం అంటే దాదాపుగా రెండు సినిమాలు తీయడమే అని అర్థమైంది. రెండు వెర్షన్లకు వేర్వేరు ఆర్టిస్టులు పని చేశారు. డైలాగులు మారేది. మాడ్యులేషన్ మారేది. టేక్స్ పెరిగేవి. చాలా షాట్లు ఐదేసి టేక్స్ చేశాం.

ఒక సినిమా చేస్తూ దాన్నే మరో భాషలో రీమేక్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. ఇది నాకు చాలా కొత్త అనుభవం. మొత్తం 190 రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ఇలాంటి సినిమాను డీల్ చేయడం మురుగదాస్ లాంటి గొప్ప దర్శకులకే సాధ్యమవుతుంది. ‘స్పైడర్’ కోసం అంత కష్టం పడ్డాక.. నాకు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘భరత్ అను నేను’ చాలా ఈజీగా అనిపిస్తోంది. చకచకా పని కానిచ్చేస్తున్నా’’ అని మహేష్ తెలిపాడు.