Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: స్పీడున్నోడు

By:  Tupaki Desk   |   5 Feb 2016 9:59 AM GMT
మూవీ రివ్యూ: స్పీడున్నోడు
X
చిత్రం: స్పీడున్నోడు

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - సోనారికా - ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - కబీర్ సింగ్ - కృష్ణచైతన్య - పోసాని కృష్ణమురళి - శ్రీనివాస్ రెడ్డి - మధనునందన్ - సత్య తదితరులు
సంగీతం: వసంత్
ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథన్
మాటలు: ప్రవీణ్ వర్మ - భీమనేని శ్రీనివాసరావు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం - నిర్మాణం: భీమనేని శ్రీనివాసరావు

‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తన రెండో సినిమాగా ఓ రీమేక్ ను ఎంచుకున్నాడు. రీమేక్ సినిమాల స్పెషలిస్టు భీమనేని శ్రీనివాస్.. తమిళ హిట్ మూవీ ‘సుందర పాండ్యన్’ను శ్రీనివాస్ తో ‘స్పీడున్నోడు’గా రీమేక్ చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

స్నేహం కోసం ప్రాణమిచ్చే శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్)... తన ఫ్రెండును, అతను ప్రేమించిన వాసంతి (సోనారికా)ని కలపడానికి రెడీ అవుతాడు. ఐతే ఆ ప్రయత్నంలో వాసంతి.. శోభన్ నే ప్రేమిస్తుంది. శోభన్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి ప్రేమకు వాసంతి తండ్రి అడ్డు పడతాడు. ఆయన్ని పెళ్లికి ఒప్పించినా.. అప్పటికే వాసంతితో పెళ్లి నిశ్చయమైన ఆమె బావ (కబీర్ ఖాన్) శోభన్ మీద పగ పెంచుకుుంటాడు. మరి ఆ పగతో అతనేం చేశాడు? శోభన్ అతణ్ని ఎలా ఎదుర్కొన్నాడు? వాసంతిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

రీమేక్ సినిమాలు తీయడంలో భీమనేని శ్రీనివాసరావుది అందెవేసిన చెయ్యి. మన నేటివిటీకి తగ్గట్లు కథాకథనాల్లో కొద్దిగా మార్పులు చేసి.. అదనపు హంగులవీ జోడించి మరింత బెటర్ ఔట్ పుట్ తేవడానికి ప్రయత్నిస్తుంటాడు భీమనేని. శుభాకాంక్షలు సినిమా నుంచి సుడిగాడు వరకు ఆయన చేసిన రీమేకుల్లో చాలా వరకు జనాల్ని మెప్పించాయి. ఐతే ఈ జాబితాలో ‘అన్నవరం’ లాంటి ఫెయిల్యూర్ కూడా ఉంది. ఎంటర్ టైనర్స్ ను చక్కగా రీమేక్ చేసే భీమనేని.. సీరియస్ సినిమాల్ని సరిగా తర్జుమా చేయలేడన్న ఫీలింగ్ కలిగించింది ‘అన్నవరం’. భీమనేని కొత్త సినిమా ‘స్పీడున్నోడు’ను కూడా ఆ కోవలోకే చేర్చొచ్చు.

రీమేక్ లు చేసేటపుడు ఒరిజినల్ లోని ఆత్మను పట్టుకోవడం చాలా ముఖ్యమని చెప్పాడు భీమనేని. ‘స్పీడున్నోడు’ చూస్తే భీమనేని ఈ విషయంలోనే తప్పటడుగు వేశాడనిపిస్తుంది. ‘సుందరపాండ్యన్’లోని ఆత్మను పట్టుకోకుండా... నేటివిటీ పేరుతో ఇష్టానుసారం మాస్ మసాలా అంశాలు కలిపేసి దాన్ని కలగాపులగం చేశాడు భీమనేని. తెలుగులోకి వచ్చేసరికి ఈ సినిమా టోనే మారిపోయింది.

సినిమాకు ప్రధాన బలమైన కథ మీద దృష్టిపెట్టకుండా కామెడీ అని.. మాస్ సాంగ్స్ అని.. పంచ్ డైలాగులని.. అవీ ఇవీ జోడించి సినిమాను ట్రాక్ తప్పించేశాడు భీమనేని. ఉన్నదున్నట్లు తీస్తే శ్రీనివాస్ కు అసలు సెట్టయ్యేదా అన్న సందేహాలు కూడా ఉన్నప్పటికీ భీమనేని చేసిన టచప్స్ వల్ల ఒరిజినల్ లో ఉన్న ఫీల్ మాత్రం పోయింది. కథాంశం చాలా బలమైంది అయినప్పటికీ.. దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా చెప్పడంలో భీమనేని ఫెయిలయ్యాడు. ముఖ్యంగా తమిళ మాతృకలో ఉన్న ఎమోషన్ తెలుగులో క్యారీ అవలేదు.

ఇక ‘సుందర పాండ్యన్’తో పోలికలు పక్కనబెట్టేసి చూస్తే.. ‘స్పీడున్నోడు’ మాస్ ఆడియన్స్ ను మెప్పించే ఓ మోస్తరు సినిమా అని చెప్పొచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ డ్యాన్సులు, ఫైట్లు.. కొన్ని కామెడీ సీన్స్ - పంచ్ డైలాగ్స్.. తమన్నా ఐటెం సాంగ్.. మాస్ ఆడియన్స్ ను ఓ మాదిరిగా ఎంగేజ్ చేస్తాయి. ప్రథమార్ధమంతా ఎక్కువగా కామెడీ మీదే దృష్టిపెట్టారు కాబట్టి కథనం కాస్త వేగంగానే సాగిపోతుంది. హీరోయిన్ తో హీరో రొమాంటిక్ ట్రాక్ అంత బాగా లేదు కానీ.. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ ఓ మోస్తరుగా నవ్విస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. ఐతే ద్వితీయార్ధంలో సీరియస్ పార్ట్ ను సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో కథనం భారంగా గడుస్తుంది. చాలా వరకు సన్నివేశాలు అతకని విధంగా తయారయ్యాయి.

విలన్ ఫ్రెండు చనిపోయే సీన్.. దానికి సంబంధించిన ఎపిసోడ్ తమిళంలో చాలా కీలకంగా అనిపిస్తుంది. కానీ తెలుగులో ఆ ఎపిసోడ్ సినిమాకు అనవసరం అన్నట్లు తయారైంది. అర్థం పర్థం లేనట్లు సాగుతున్న కథనం చూస్తే.. ఓ దశలో తమిళ మాతృక మీదే సందేహాలు కలుగుతాయి. ఏముందని దీన్ని రీమేక్ చేశారు అన్న డౌట్ కూడా కొడుతుంది. ఐతే ప్రేక్షకుడిలో సహనం నశిస్తున్న దశలో క్లైమాక్స్ మళ్లీ సినిమాకు కాస్త ఊపిరి పోస్తుంది. ట్విస్టుతో ముడిపడిన క్లైమాక్స్ సినిమాకు బలంగా నిలిచింది. ఈ సన్నివేశం చిత్రీకరణ కూడా బాగుంది. క్లైమాక్స్ సినిమా మీద ఇంప్రెషన్ కొద్దిగా మార్చినప్పటికీ ఓవరాల్ గా మాత్రం ‘స్పీడున్నోడు’ మంచి ఫీలింగ్ అయితే కలిగించదు.

నటీనటులు:

బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతోనే డ్యాన్సులు - ఫైట్లలో తనేంటో రుజువు చేసుకున్నాడు. రెండో సినిమాలో కూడా అంతకు మించి అతడి గురించి చెప్పుకోవడానికేం లేదు. తొలి సినిమాలో నటించాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది కానీ.. ఇందులో మాత్రం అవసరం బాగానే పడింది. కానీ శ్రీనివాస్ మెప్పించలేకపోయాడు. ఎమోషనల్ సీన్స్ లో అతను తేలిపోయాడు. డైలాగ్ డెలివరీ కూడా పెద్ద మైనస్ అయింది. తన వల్ల చనిపోయిన ఫ్రెండు ఇంటికెళ్లి డబ్బులిచ్చే సన్నివేశంలో శ్రీనివాస్ నటన కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఇబ్బందిగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో కూడా అతను సరిగా చేయలేకపోయాడు. హీరోయిన్ సోనారికా సినిమాకు మిస్ ఫిట్. ఆమె రాయలసీమ పల్లెటూరి అమ్మాయిగా ఏమాత్రం సెట్టవలేదు. తన ఫీచర్స్ అలా ఉన్నాయి మరి. నటన గురించి కూడా చెప్పడానికేం లేదు. విలన్ గా కబీర్ కూడా అంతే. మన తెలుగు నటుల్నే ఎవరినైనా ట్రై చేయాల్సింది. కృష్ణ చైతన్య బాగా చేశాడు. హీరో ఫ్రెండు పాత్రలో శ్రీనివాస్ రెడ్డి.. ఇల్లరికపు అల్లుళ్లుగా పృథ్వీ - పోసాని కృష్ణమురళి ఓ మోస్తరుగా నవ్వించారు. రావు రమేష్ రాయలసీమ యాసలో పర్వాలేదనిపించాడు. ప్రకాష్ రాజ్ పాత్ర అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఝాన్సీ బాగా చేసింది.

సాంకేతికవర్గం:

సినిమాకు పాటలు ఏమాత్రం సూటయ్యాయి అన్నది పక్కనబెడితే డి.జె.వసంత్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్టవుతుంది. శ్రీనివాస్ తన డ్యాన్స్ టాలెంట్ చూపించడానికి వసంత్ పాటలు ఉపయోగపడ్డాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. విజయ్ ఉలగనాథన్ ఛాయాగ్రహణం బాగుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎస్సెట్. ఖర్చు విషయంలో భీమనేని ఎక్కడా తగ్గలేదు. పాటల చిత్రీకరణకు బాగా ఖర్చు పెట్టాడు. భీమనేని - ప్రవీణ్ వర్మ కలిసి రాసిన మాటలు కొన్నిచోట్ల పేలాయి. ఐతే కొన్ని చోట్ల పంచ్ ల కోసం ప్రయాస మరీ ఎక్కువైంది. ఇక రీమేక్ ల విషయంలో ఆరితేరిన భీమనేని.. ఈసారి తప్పటడుగులు చాలానే వేశాడు. తన బలం ఎంటర్ టైనర్స్ అయినప్పటికీ సీరియస్ సినిమాను ఎంచుకోవడం.. దాన్ని నేటివిటీ పేరుతో ఎలాపడితే అలా మార్చేయడం.. శ్రీనివాస్ ను ఈ పాత్రకు ఎంచుకోవడం.. ఇలా చాలానే తప్పులు కనిపిస్తాయి.

చివరగా: స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్

రేటింగ్- 2.5/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre