చైతు ఆ రీమేక్ ఎందుకు చేస్తాడు?

Wed Feb 20 2019 10:08:11 GMT+0530 (IST)

తండ్రుల సినిమాలు వారసులు రీమేక్ చేయడం వినడానికి బాగానే ఉంటుంది కానీ అందులో ఏ మాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వచ్చి మొత్తం బోల్తా కొట్టేస్తుంది. అందుకే రామ్ చరణ్ తాను ఎప్పుడూ చిరంజీవి క్లాసిక్స్ ని టచ్ చేసే సమస్యే లేదని గతంలోనే తేల్చి చెప్పాడు. దాని కన్నా గ్యాంగ్  లీడర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా ఒకదశలో సాగాయి. తాజాగా తమిళ మీడియాలో నాగ చైతన్య ఓ నాగార్జున సినిమాను రీమేక్ చేయబోతున్నాడు అనే వార్తలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి.1997లో వచ్చిన రచ్చగన్(రక్షకుడు)ని చైతుతో తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటి సారాంశం. రక్షకుడు నాగ్ ఇప్పటిదాకా నటించిన వాటిలో హయ్యస్ట్ బడ్జెట్ తో రూపొందిన మూవీ. దానికి పెట్టిన ఖర్చు అందులో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అందరిని నోరెళ్ళబెట్టుకుని చూసేలా చేసాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా పెద్ద హిట్టయ్యింది. కానీ దురదృష్టవశాత్తు సినిమా మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఉన్నదంతా ఊడ్చి పెట్టిన నిర్మాత కుంజు మోన్ కి తీవ్ర నష్టాలను మిగిల్చింది

మరి ఇంత బ్యాడ్ బ్యాక్ డ్రాప్ ఉన్న రక్షకుడు నాగ చైతన్య చేస్తాడన్న వార్తలోనే కామెడీ ఉంది. అయితే ఇది విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చింది అని సదరు తమిళ మీడియా పేర్కొనడం విశేషం. ఒకవేళ చైతు నిజంగా చేయాలి అనుకుంటే హలో బ్రదర్-గీతాంజలి-శివ-నిన్నే పెళ్లాడతా లాంటి అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి . కోరి మరీ రక్షకుడు జోలికి ఎందుకు వెళ్తాడు. అయినా ఇప్పుడు దాన్ని కాలానుగుణంగా మార్చి తీయాలన్నా వంద కోట్ల దాకా ఖర్చు పెట్టాలి. చైతుకున్న మార్కెట్ దృష్ట్యా అది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. సో చైతు మనసులో అసలు రీమేక్ ఆలోచనే లేనప్పుడు చెన్నై మీడియాలో ఈ వార్తలేందుకు షికారు చేస్తున్నట్టో?