#NBK105 కేరాఫ్ పట్టయా అంటున్న సోనాల్

Sat Aug 24 2019 22:02:21 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ పేరు తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి పరిచయమే. 'సైజ్ జీరో' లో సెకండ్ హీరోయిన్. రామ్ సూపర్ హిట్ ఫిలిం 'పండగ చేస్కో' లో హీరోయిన్. నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్'.. 'డిక్టేటర్' చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.  హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది కానే అవేవీ బ్రేక్ ఇవ్వలేకపోయాయి.  ఈ బ్యూటీ తాజాగా బాలకృష్ణతో మరోసారి జోడీ కట్టింది.



బాలయ్య ప్రస్తుతం కెయస్ రవి కుమార్ దర్శకత్వంలో #NBK105 లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.  బాలయ్యతో ముచ్చటగా మూడో సారి హీరోయిన్ గా నటిస్తుండడంతో సోనాల్ ఫుల్ జోష్ లో ఉంది.  తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.  ఒక ఫోటోను పోస్ట్ చేసి "కొలవలేని లోతులు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ లోనే #NBK105  #షూట్ లైఫ్ #వర్క్ మోడ్ #పట్టయా అంటూ ఓ పది హ్యాష్ టాగ్స్ ను తగిలించింది.  అర్థం అయిందిగా... #NBK105 షూటింగ్ లో భాగంగా పట్టయాలో ఉంది.  ఫోటోలో జిగేల్ మంటున్న షర్టు చూస్తే ఈ సినిమాలో పాట చిత్రీకరణ జరుపుతున్నారని అర్థం అయిపోతోంది కదా. అంతా బాగానే ఉంది కానీ 'ఆ కొలవలేని లోతులు' ఏంటో?  పొరపాటున బాలయ్య బాబు కనుక ఇట్టాంటి పదాలు వింటే 'నాకు తెలియనివా?' అని కసురుకుంటారేమో.. జాగ్రత్త సోనాలూ!

ఎన్టీఆర్ బయోపిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరచడంతో నందమూరి అభిమానులు ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నారు.  బాలయ్యకు 'జైసింహా' లాంటి హిట్ అందించిన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి బాలయ్య-కేయస్ కాంబోపై అంతటా ఆసక్తి ఉంది. పైగా బాలయ్య తన కొత్త లుక్ తో అందరిచేత ఔరా.. అనిపించాడు.  యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారట.