Begin typing your search above and press return to search.

సోనాక్షి ఆ కుర్రాడికి సారీ చెప్పింది

By:  Tupaki Desk   |   29 Aug 2015 12:22 PM GMT
సోనాక్షి ఆ కుర్రాడికి సారీ చెప్పింది
X
టెక్నాలజీతో ఏమైనా చేయగల ఈ రోజుల్లో మనం చూసేదంతా నిజమే అనుకుంటే పొరబాటే. అది ఫొటో కావచ్చు, వీడియో కావచ్చు.. తొందరపడి ఓ అభిప్రాయానికి వచ్చేస్తే చాలా నష్టం జరిగిపోతుంది. ఢిల్లీకి చెందిన జస్లీన్ కౌర్ అనే అమ్మాయి ఇలాగే జనాల్ని తప్పుదోవ పట్టించింది. పబ్లిసిటీ యావతో ఈ అమ్మాయి చేసిన పని.. ఓ అబ్బాయి జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. ఈ నెల 22న ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో బైకుపై వెళ్తున్న సరబ్ జీత్ అనే యువకుడు తనను వేధించాడంటూ.. అతను అసభ్యంగా సైగ చేస్తున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది జస్లీన్. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో ఆ కుర్రాడిని పోలీసులు అరెస్టు చేశారు. జస్లీన్ తెగువ చూసి.. అందరూ శభాష్ అన్నారు.

జస్లీన్ ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన కార్యాలయానికి పిలిపించి అభినందనలు కూడా తెలియజేశాడు. కానీ ఒక రోజు తర్వాత అసలు విషయం అందరికీ బోధపడింది. నిజానికి సరబ్ జీత్ ఆ అమ్మాయిని వేధించనే లేదు. ఫొటోను మార్ఫింగ్ చేసి జస్లీన్ ఆడిన గేమ్ అందరికీ అర్థమైంది. అసలు ఫొటో చూసి అందరూ విస్తుపోయారు. మీడియా ముందు జస్లీన్ తడబడ్డ తీరు చూసి ఆమె పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసిందని అందరికీ అర్థమైపోయింది. దీంతో ముందు ఆ కుర్రాణ్ని తిట్టిపోసి.. జస్లీన్ కు మద్దతిచ్చిన వాళ్లందరూ అవాక్కయ్యారు. ఇలా మద్దతిచ్చిన వాళ్లలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా ఉంది. ఐతే తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడిన సోనాక్షి.. సరబ్ జీత్ కు క్షమాపణలు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. వాస్తవం తెలుసుకోకుండా తొందరపడినందుకు తనను మన్నించాలని సరబ్ జీత్ ను కోరింది సోనాక్షి. ఇలా భేషజం లేకుండా సారీ చెప్పినందుకు సోనాక్షిని అభినందించాల్సిందే.