Begin typing your search above and press return to search.

సన్నాఫ్ సత్యమూర్తి సంచలనం

By:  Tupaki Desk   |   24 Sep 2016 7:30 PM GMT
సన్నాఫ్ సత్యమూర్తి సంచలనం
X
తెలుగులో డిజాస్టర్లయిన కొన్ని సినిమాలు హిందీలోకి డబ్ కావడం.. అక్కడ టీవీ ఛానెళ్లలో.. యూట్యూబ్ లో అదరగొట్టడం కామన్ అయిపోతోంది ఈ రోజుల్లో. హిందీలో సోనీ మ్యాక్స్ లాంటి ఛానెళ్లు పెడితే ప్రతి రోజు ప్రధానంగా తెలుగు డబ్బింగ్ సినిమాలే రన్ అవుతూ ఉంటాయి. మరోవైపు యూట్యూబ్ లో సైతం హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. మంచి వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. తెలుగులో ఏవరేజ్ గా ఆడిన అల్లు అర్జున్ మూవీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ పేరుతోనే ఈ చిత్రాన్ని హిందీలోకి అనువదించి యూట్యూబ్ లో పెట్టగా.. దాదాపు 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇప్పటిదాకా. ప్రస్తుతం హిట్స్ 69 లక్షలున్నాయి. త్వరలోనే కోటి వ్యూస్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. మరోవైపు టీవీలోనూ ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. గత వారానికి హిందీ ఛానెళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ప్రతివారం టీవీ రేటింగుల్ని వెల్లడించే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా ఈ విషయాన్ని తెలిపింది. విశేషం ఏంటంటే.. ఈ లిస్టులో టాప్-3లో తెలుగు సినిమాలే ఉన్నాయి. రెండో స్థానంలో ‘బాహుబలి’ నిలిస్తే.. మూడో స్థానం ‘ఇష్క్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘భాయిగిరి’ నిలిచింది. దిల్ వాలే.. షోలే తర్వాతి స్థానాలు సాధించాయి. దీన్ని బట్టే తెలుగు డబ్బింగ్ సినిమాలకు హిందీలో ఎంత ఫాలోయింగ్ ఉంటోందో అంచనా వేయొచ్చు.