Begin typing your search above and press return to search.

టీవీ మూవీ ఆర్టిస్టుల వివాదాల‌కు ప‌రిష్కార‌మేదీ?

By:  Tupaki Desk   |   20 July 2019 2:30 PM GMT
టీవీ మూవీ ఆర్టిస్టుల వివాదాల‌కు ప‌రిష్కార‌మేదీ?
X
దాదాపు 900 మంది స‌భ్యుల‌తో మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) టాలీవుడ్ లో అతి పెద్ద అసోసియేష‌న్ గా పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో స‌భ్య‌త్వం కావాలంటే ల‌క్ష‌ల్లో చెల్లించాల్సి రావ‌డంతో అది చిన్నా చిత‌కా ఆర్టిస్టుల‌కు అందుబాటులో లేకుండా పోయింది. ఈ విష‌యంలోనే శ్రీ‌రెడ్డి వంటి న‌టీమ‌ణుల ఆవేదన గురించి తెలిసిందే. ఇక ఇదే త‌ర‌హా కోపంతోనే కొంద‌రు ఆర్టిస్టులు క‌లిసి అప్ప‌ట్లో తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల (టీఎంటీయూ) యూనియ‌న్ ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఘంలో దాదాపు 800 పైగా ఆర్టిస్టులు రిజిస్ట‌ర్ అయ్యారు. కేవ‌లం 5-6 వేలు చెల్లించి ఇందులో స‌భ్య‌త్వం పొందే వీలుండ‌డంతో ఎంద‌రో చిన్నా చిత‌కా ఆర్టిస్టులు ఇందులో స‌భ్య‌త్వాలు పొందారు.

అయితే ఈ సంఘానికి అంత‌కంత‌కు క్రేజు పెర‌గ‌డంతో వివాదాలు ర‌చ్చ‌కెక్కాయి. ఇందులోనూ `మా` సంఘం త‌ర‌హాలోనే ఇరువ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు సాగుతోంది. సంఘంలో స‌భ్యుల‌కు నిరంత‌రం అవ‌కాశాలిప్పించే వెసులు బాటు పెరిగి సంఘానికి గౌర‌వం గుర్తింపు ద‌క్కాయి. అయితే ఆ గౌర‌వాన్ని కొంద‌రు యూనియ‌న్ స‌భ్యులు తుంగ‌లో తొక్కేయ‌డంపై నిరంత‌రం చ‌ర్చ సాగుతోంది. ఈ సంఘంలో ఇదివ‌ర‌కూ ప‌ని చేసిన అధ్యక్ష కార్య‌ద‌ర్శులు స‌రిగా ప‌ని చేయ‌లేద‌ని .. ఆర్ధిక‌ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని కొంద‌రు ఆరోపించ‌డంతో అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల గొడ‌వ‌లు జ‌రిగాయి. అవి పోలీస్ స్టేష‌న్.. కోర్టు మెట్లు ఎక్కే వ‌ర‌కూ వెళ్లింది. ఇప్ప‌టికీ సంఘంలో స‌భ్యుల మ‌ధ్య క‌మిటీలో లొసుగుల గురించి ర‌క‌ర‌కాల వివాదాలు ర‌చ్చ‌కెక్క‌డం స‌భ్యుల్లో చ‌ర్చ‌కొస్తోంది. ప్ర‌స్తుతం 24 మంది స‌భ్య‌త్వాల‌కు సంబంధించిన వివాదం న‌డుస్తోంది.

ఇలాంటి గ‌డ‌బిడ న‌డుమ ఈ ఆదివారం ఉద‌యం యూనియ‌న్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ కి ఏర్పాట్లు సాగుతున్నాయి. జులై 21 ఆదివారం ఉదయం 9గం.ల నుండి ఈసీ మీటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని స‌భ్యుల‌కు సందేశం పంపారు. ఎస్ ఆర్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఏ1037 దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ కమ్యూనిటీహాల్ (అమరావతి టిఫిన్స్ ప్రక్కన) లో ఈ స‌మావేశం ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ మెంబెర్ షిప్ కార్డ్ తీసుకురావాల‌ని జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సైదులు ప్ర‌క‌టించారు. ఇక‌పోతే ఈ స‌మావేశంలోనూ వివాదాలు ర‌చ్చ‌కెక్క‌నున్నాయా? లేక పెద్ద‌లంతా ఏక‌మై గొడ‌వ‌లేవీ లేకుండా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకుంటారా? అన్న చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల అంత‌ర్గ‌త పోరాటాల‌తో వివాదాల‌తో తెలంగాణ మూవీ & టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప‌రువు మ‌ర్యాద‌లు గంగ‌లో క‌లిసిపోయాయ‌న్న ఆవేద‌న ఆర్టిస్టుల్లో వ్య‌క్తం అవుతోంది. అయితే ఈ స‌మావేశంలో అయినా దీనిపై చ‌ర్చ జ‌రిగి స‌మ‌స్య‌లు స‌మ‌సిపోవాల‌ని కోరుకుంటున్నారు.