Begin typing your search above and press return to search.

సోగ్గాడి ముందు స్పీడున్నోడు నిలవట్లేదు

By:  Tupaki Desk   |   7 Feb 2016 5:30 PM GMT
సోగ్గాడి ముందు స్పీడున్నోడు నిలవట్లేదు
X
సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి.. కానీ సోగ్గాడే చిన్ని నాయనా మాత్రం తగ్గట్లేదు. సంక్రాంతికి వచ్చిన మిగతా సినిమాలన్నీ జోరు తగ్గించేశాయి. డిక్టేటర్ అడ్రస్ దాదాపుగా గల్లంతయింది. నాన్నకు ప్రేమతో - ఎక్స్ ప్రెస్ రాజా కూడా డల్లయిపోయాయి. ఇక సంక్రాంతి తర్వాత వచ్చిన కొత్త సినిమాలు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది - కళావతి కూడా వీకెండ్ తర్వాత వార్తల్లో లేకుండా పోయాయి. అయినా సోగ్గాడే చిన్నినాయనా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం కొనసాగిస్తూనే వచ్చింది. మూడో వీకెండ్ లో కూడా హౌస్ ఫుల్స్ తో నడిచిందీ సినిమా.

మొన్న శుక్రవారం వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘స్పీడున్నోడు’ మీద పాజిటివ్ బజ్ ఉండటంతో తొలి రోజు ఉదయం ‘సోగ్గాడే..’ మీద ఎఫెక్ట్ పడ్డట్లు కనిపించింది. చాలా చోట్ల మార్నింగ్ షోలకు జనాలు తగ్గిపోయారు. ‘స్పీడున్నోడు’కు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఐతే ఆ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో మళ్లీ సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. నాగ్ సినిమా మళ్లీ పుంజుకుంది. ‘స్పీడున్నోడు’తో సమానంగా కలెక్షన్లు రాబట్టింది. ముందు వారాల స్థాయిలో ఫుల్స్ అయితే లేదు కానీ.. ఇప్పటికీ థియేటర్లలో ఉన్న అన్ని సినిమాల్లోకి అత్యధిక కలెక్షన్లు సాధిస్తోంది ‘సోగ్గాడే...’నే. నిన్న శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో కలెక్షన్ల లెక్కలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ఫస్ట్, సెకండ్ షోలకు ‘సోగ్గాడే..’ కలెక్షన్లే ఎక్కువున్నాయి. ఆదివారం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ శుక్రవారం కృష్ణగాడి వీర ప్రేమగాథ - గరం రిలీజయ్యాక గానీ.. సోగ్గాడి జోరు తగ్గేలా లేదు.