Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ: సైజ్ జీరో

By:  Tupaki Desk   |   27 Nov 2015 10:16 AM GMT
సినిమా రివ్యూ: సైజ్ జీరో
X
చిత్రం : సైజ్ జీరో

నటీనటులు: అనుష్క - ఆర్య - సోనాల్ చౌహాన్ - ప్రకాష్ రాజ్ - ఊర్వశి - అడివి శేష్ - గొల్లపూడి మారుతీరావు - ఆలీ - బ్రహ్మానందం - భరత్ తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: నిరవ్ షా
మాటలు: కిరణ్
కథ - స్క్రీన్ ప్లే: కనిక థిల్లాన్
నిర్మాత- పొట్లూరి వరప్రసాద్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి

అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల స్థాయి పెంచిన నటి అనుష్క. ఆమె ప్రధాన పాత్రలో ‘సైజ్ జీరో’ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించింది. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సైజ్ జీరో విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

స్వీటీ అనే ముద్దు పేరున్న సౌందర్య (అనుష్క) తన బొద్దుతనంతో ఇబ్బంది పడుతుంటుంది. తనను చూడ్డానికి వచ్చిన అబ్బాయిలంతా తన సైజ్ చూసి పారిపోతుంటారు. ఇలా తనని చూడ్డానికి వచ్చిన అభి (ఆర్య)ని చూసి స్వీటీ ఇష్టపడుతుంది. అభికి తాను నచ్చనన్న ఉద్దేశంతో రిజెక్ట్ చేసినప్పటికీ అతడిపై ప్రేమ పెంచుకుంటుంది స్వీటీ. కానీ అతను స్లిమ్ముగా ఉండే సిమ్రన్ (సోనాల్ చౌహాన్)ను ఇష్టపడతాడు. దీంతో స్వీటీ మనసు విరిగిపోతుంది. బరువే తన సమస్య అని భావించి దాన్ని తగ్గించుకోవడానికి సైజ్ జీరో అనే క్లినిక్ లో చేరుతుంది. మరి అక్కడ చేరిన స్వీటీ సన్నబడిందా.. చివరికి ఆమె ఎవరిని పెళ్లాడింది.. అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

ఒబెసిటీ అన్నది యూనివర్శల్ ప్రాబ్లెం. లావుగా ఉండటం వల్ల అమ్మాయిలకు పెళ్లి కాకపోవడం అన్నది మనకు నిత్యం ఎదురయ్యే అనుభవం. కంటెంటపరరీగా ఉండే, ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యే ఈ పాయింట్ మీద కథ రాసుకోవడం... అనుష్క లాంటి ఫేమస్ హీరోయిన్ తో లీడ్ రోల్ చేయించడం.. ‘సైజ్ జీరో’కున్న అతి పెద్ద ప్లస్ పాయింట్స్. ప్రోమోస్, టీజర్ - ట్రైలర్ అన్నీ కూడా క్రియేటివ్ గా అనిపించడంతో సినిమా అంతా కూడా ఇలాగే కొత్తగా ఉంటుందని ఆశిస్తాం. కానీ ఆ అంచనాలకు తగ్గ వైవిధ్యం, ఆసక్తి సినిమాలో లేదు. కాన్సెప్ట్ కొత్తదే కానీ.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా లేదు.

‘‘నిన్ను నువ్వుగా అంగీకరించు.. సమాజం కూడా నిన్ను అంగీకరిస్తుంది’’ అని చెప్పడం సైజ్ జీరో సినిమా ప్రధాన ఉద్దేశం. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఫాలో కావద్దు.. కష్టపడి బాడీని ఫిట్ గా ఉంచుకోండి అన్న సందేశాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ‘సైజ్ జీరో’ టీం. ఈ సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పడానికి మంచి ప్రయత్నమే జరిగింది. కానీ కథనం అంతా మన అంచనాలకు తగ్గట్లే సాగడం.. కొత్తగా ఏమీ చూపించకపోవడం... రిపీటెడ్ సీన్స్.. కొన్నిచోట్ల సాగతీత.. సినిమాకు మైనస్ గా మారాయి.

కాన్సెప్ట్ పరంగా ‘సైజ్ జీరో’ మంచి ప్రయత్నం. అందులో సందేహం లేదు. పాత్ర కోసం బరువెక్కడమే కాక.. అనుష్క తనదైన శైలిలో స్వీటీ పాత్రను పోషించి సినిమాను తన భుజాల మీద నడిపించింది. అమ్మాయిలు లావుగా ఉంటే వచ్చే ఇబ్బందుల్ని ఆ పాత్ర ద్వారా సరదా సన్నివేశాలతో బాగానే చూపించాడు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. ప్రథమార్ధం వరకు వినోదం బాగానే పండింది. ఐతే ద్వితీయార్ధంలోనే కథ ఒక దారీ తెన్నూ లేకుండా సాగుతుంది.

హీరోయిన్లో రియలైజేషన్ వచ్చే సన్నివేశాలు సరిగా లేవు. హీరోయిన్, విలన్ మధ్య పోరాటానికి సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయారు. వీళ్ల ఎత్తులు పైఎత్తులు మామూలుగా అనిపిస్తాయి. రిపీటెడ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అసలు ద్వితీయార్ధంలో హీరోయిన్ లావు విషయం పక్కకు వెళ్లిపోయి విలన్ ను దెబ్బ తీసే వ్యవహారం మీద కథనాన్ని నడిపించడంతో సినిమా ఉద్దేశమే దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. చివరికి సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారన్న గందరగోళం మిగులుతుంది. ఐతే చివర్లో నాగార్జున సహా సెలబ్రెటీల క్యామియో ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఫన్నీగా ఉంది. ఊర్వశి క్యారెక్టర్ తో సినిమాకు కొసమెరుపు లాంటి ముగింపునిచ్చారు.

సినిమా నిడివి తక్కువే అయినా సాగతీతగా అనిపిస్తుందంటే అందుకు కథనంలో లోపాలే కారణం. నిజానికి ‘సైజ్ జీరో’ కాన్సెప్ట్ జనాల మనసుల్లోకి చొచ్చుకెళ్లడానికి అవకాశమున్న కాన్సెప్ట్. లావుగా ఉండే వాళ్ల ఎమోషన్స్ ని సరిగ్గా తెరమీదికి తీసుకురాగలిగితే ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించేయొచ్చు. ఐతే ప్రధాన పాత్రధారి బాధల్ని కేవలం వినోదం కోసమే వాడుకున్నారు. జనాల్ని ఆ పాత్రతో ఎమోషనల్ కనెక్ట్ చేయించడంలో అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. దీంతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి వచ్చేపుడు ‘ఓకే’ అనుకుంటారు తప్పితే.. ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయితే ఉండదు.

నటీనటులు:

స్వీటీ పాత్ర కోసం అనుష్క పెట్టిన శ్రద్ధకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాలో అనుష్క కాకుండా స్వీటీనే కనిపిస్తుంది. అంతలా తన రూపాన్ని మార్చుకుంది అనుష్క. కొన్ని చోట్ల ఆమె అవతారం కొంచెం అసహజంగా కనిపించినా.. ఓవరాల్ గా మాత్రం ‘స్వీటీ’ పాత్ర కోసం అనుష్క పడ్డ కష్టం వృథా కాలేదు. నటన పరంగా కూడా అనుష్క బాగా చేసింది. సైజ్ సెక్సీ సాంగ్ లో అనుష్క పెర్ఫామెన్స్ అదుర్స్ అనిపిస్తుంది. ఆమె కెరీర్లో ఇది గుర్తుంచుకోదగ్గ పాత్ర అనడంలో సందేహం లేదు. ఆర్య అభి పాత్రకు కరెక్టుగా సూటయ్యాడు. అతడి నటన బాగుంది. కానీ ఆర్య పాత్రను సరిగా తీర్చిదిద్దలేదు. సిమ్రన్ పాత్రతో సోనాల్ చౌహాన్ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ప్రకాష్ రాజ్ తనకు అలవాటైన కన్నింగ్ విలన్ పాత్రను చాలా ఈజీగా చేసుకెళ్లిపోయాడు. తల్లి పాత్రలో ఊర్వశి చాలా బాగా నటించింది. అడివి శేష్ ఓకే. బ్రహ్మానందం, పోసాని, ఆలీ పాత్రల గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

కీరవాణి పాటలు సోసోగా అనిపిస్తాయి. సినిమాలో వచ్చే మెలోడీస్ అక్కడికి యాప్ట్ గానే అనిపించాయి కానీ.. మళ్లీ వినాలనిపించేలా మాత్రం లేవు. సైజ్ సెక్సీ పాట ఎంటర్టైనింగ్ గా ఉంది. నేపథ్య సంగీతంలో కీరవాణి తన ముద్ర చూపించాడు. నిరవ్ షా ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోవాల్సిన హైలైట్. మాటలు మామూలుగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పీవీపీ బ్యానర్ స్థాయికి తగ్గట్లు రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అయినా ఎక్కడా రాజీ పడలేదు. కథ విషయంలో కనికకు అభినందనలు చెప్పాలి. కానీ స్క్రీన్ ప్లే అంత ఆసక్తికరంగా లేదు. దర్శకుడిగా ప్రకాష్ కోవెలమూడి టేస్టు, అతడి పనితనం కొన్ని చోట్ల కనిపిస్తుంది కానీ.. నరేషన్ బాగా స్లో కావడం మైనస్.

చివరగా: సైజ్ జీరో.. అనుకున్నంత వెయిట్ లేదు.

రేటింగ్: 2.5/5