డ్రగ్స్ కేసులో పూరీ రవితేజలకు నోటీసులు!

Mon Jul 17 2017 20:44:32 GMT+0530 (IST)

టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఎక్సైజ్ కార్యాలయం నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్ రవితేజల పేర్లు వినిపిస్తున్నా వాళ్లకు నోటీసులు అందలేదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ రవితేజలకు ఈ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట  పూరీ జగన్నాథ్ హాజరు కానుండగా 24న రవితేజ హాజరు కానున్నారు.

ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. మరికొంతమంది ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆ సినీ ప్రముఖులు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. సిట్ అడుగబోయే కఠినమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నెల 19న పూరీ జగన్నాథ్ - 20న హీరోయిన్ ఛార్మి - 21న ముమైత్ ఖాన్ - 22న సుబ్బరాజు - 23న శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ నెల 25న చిన్నాను - 26న నవదీప్ -  27న తరుణ్ - 28న తనీష్ నందులను సిట్ విచారించనుంది. కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా వీరందరికీ తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో పేర్లు వినిపిస్తున్న ప్రముఖులు కొందరు మీడియా ముందుకు వచ్చి ఈ డ్రగ్స్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపారు. కాగా తన తండ్రికి ఈ కేసుతో సంబంధం లేదని పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. డ్రగ్స్ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి చెప్పిన విషయం విదితమే. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఎవరి పేర్లను అధికారికంగా వెల్లడించలేదు.