శాస్త్రిగారు భలేగా ఏసేశారు!

Tue Dec 18 2018 22:41:57 GMT+0530 (IST)

శాస్త్రిగారు ఏసేశారు! అదిరిపోయే పంచ్ వేసేశారు. ఎవరి మీద?  తెలుగు సినిమా వెనకబాటు తనం మీద.. అందుకు కారకులైన వారి మీద.. !!  కొత్తొక వింత.. పాతొక రోత! అన్న చందంగా ఆయన బుల్లెట్ పంచ్ భలేగా పేలింది. మొత్తానికి ఆయన `అంతరిక్షం` (లైవ్ లో) తీసినోళ్లను పొగడబోయి చాలా పెద్ద మ్యాటర్ నే కెలికారు. ఇంకా చెప్పాలంటే నందమూరి క్యాంపు ఉడుక్కునేలా.. మెగా క్యాంప్ నవ్వుకునేలా ఆ పంచ్ ని విసిరేశారు.ఇంతకీ శాస్త్రి గారు ఏం పంచ్ వేశారు? అంటే.. ``గట్టిగా కాలు నేలకేసి కొడితే భూకంపం రావడం.. విజిల్ కొడితే ట్రైన్ రావడం తరహా చిత్రాలు చూసి విసిగిపోయాం`` అనేశారు. భయంకరమైన హింసతో కూడుకున్న ఫైట్స్ కూడా ఇప్పుడు కామెడీ అయిపోయాయి. ఇలాంటి విచిత్రాలని చూసిన తెలుగు ప్రేక్షకులలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని సిరివెన్నెల అన్నారు. అయితే యాధృచ్ఛికంగా అన్నారో యథాలాపంగా అన్నారో కానీ ఉన్న నిజాన్నే చెప్పారు. తెలుగు సినిమా వెనకబాటుతనం నుంచి కొత్త దారి వైపు వెళ్లడాన్ని ఆయన మా గొప్పగా కీర్తించారు.

అభిరుచి మారింది కాబట్టి కొత్త సినిమాలు వస్తున్నాయా లేక కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకుడి అభిరుచి మారిందా! అనేది `చెట్టు ముందా విత్తు ముందా` తరహాలో మిలియన్ డాలర్ల ప్రశ్న!! అని సిరివెన్నెల అన్నారు. తెలుగు సినిమా గమనాన్ని కొత్త ట్రెండులోకి తీసుకెళుతూ సంకల్ప్ రెడ్డి సినిమాలు తీస్తున్నాడని పొగిడేశారు. గమ్యం కంచె లాంటి కొత్త ట్రెండుకు మార్చిన ఘనత క్రిష్ దేనని శాస్త్రిగారు ప్రశంసించారు. నిజమే క్రిష్ - సంకల్ప్ లాంటి దర్శకుల కొత్త ఆలోచనల వల్లనే ట్రెండ్ మారిందని అంగీకరించాల్సి ఉంటుంది. ఇక ``గట్టిగా కాలు నేలకేసి కొడితే భూకంపం రావడం.. విజిల్ కొడితే ట్రైన్ రావడం`` అన్నదాంట్లో సీనియర్ రచయితలు పరుచూరి వారి క్రియేటివిటీ ఉంది. ఆ సన్నివేశాలపై నేటి ట్రెండ్ ని పోలుస్తూ పరుచూరి సోదరులు తమపై తామే సెటైర్లు వేసుకున్న సందర్భాలున్నాయి. ఇక తన దర్శకరచయితల్ని గౌరవించి ఏం చెబితే అదే చేసే బాలయ్యబాబు అప్పట్లో అలాంటివి చేశారు. కానీ ఇప్పుడు ఆయనా `గౌతమిపుత్ర శాతకర్ణి` లాంటి సినిమాలు చేస్తున్నారు కదా శాస్త్రి గారూ? ఒక సందర్భంలో తన వెంటపడి అడ్డగోలు భజన చేసే దర్శకుల్ని బాలయ్యబాబు ఏకి పడేసిన సంగతిని మరిచారా?