Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 'దయ'.. అతను 'భలేరావ్'

By:  Tupaki Desk   |   16 Aug 2018 8:13 AM GMT
ఎన్టీఆర్ దయ.. అతను భలేరావ్
X
సౌత్ సినిమాల్ని బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. తెలుగు.. తమిళం.. మలయాళ భాషల్లో హిట్టయిన సినిమాలకు తమదైన ట్రీట్మెంట్ ఇచ్చి బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్దుతుంటారు అక్కడి ఫిలిం మేకర్స్. ఈ టైపు సినిమాలు బాగానే ఆడుతుంటాయక్కడ. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘టెంపర్’ సైతం హిందీలో పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి హిందీలో ‘సింబా’ అనే పేరు పెట్టారు. తారక్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషిస్తుంటే.. బాలీవుడ్లో మసాలా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. అగ్ర నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి అతడీ సినిమాను స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పోలీస్‌గా రణ్వీర్ సింగ్ ఇంటెన్స్ అవతార్‌ ను చూపించారు. తెలుగులో ఎన్టీఆర్ పేరు దయ కాగా.. ఇక్కడ రణ్వీర్ కు సంగ్రామ్ భలేరావ్ అని ఆసక్తికరమైన పేరు పెట్టారు. హీరోలో మార్పు వచ్చాక పోలీస్ స్టేషన్లో విశ్వరూపం చూపించే సన్నివేశానికి సంబంధించిన దృశ్యాల్ని మేకింగ్ వీడియోలో చూపించారు. మాస్ క్యారెక్టర్లను డీల్ చేయడంలో అందె వేసిన చేయి అయిన రోహిత్.. హీరో పాత్రను హిందీలో మరింత ఇంటెన్స్ గా చూపించినట్లు ఈ మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ కూడా ఈ పాత్రలో సులువుగానే ఒదిగిపోయినట్లున్నాడు. ఈ చిత్రం హిందీ మాస్ ప్రేక్షకులకు విందు లాగే కనిపిస్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సరసన సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కథానాయికగా నటిస్తోంది.