Begin typing your search above and press return to search.

సింహాద్రి.. మగధీర.. రికార్డులు ఫేక్?

By:  Tupaki Desk   |   29 May 2017 9:38 AM GMT
సింహాద్రి.. మగధీర.. రికార్డులు ఫేక్?
X
తెలుగు సినిమాలు వంద రోజులాడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా కలెక్షన్ల మీదే నడుస్తోంది రికార్డుల వ్యవహారం. అయినప్పటికీ కొన్ని సినిమాలు ఇన్ని కేంద్రాల్లో వంద రోజులాడాయంటూ ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో ఒక్క సెంటర్లో కూడా ఏ సినిమా కూడా వంద రోజులాడే పరిస్థితి లేదన్న సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ 500 రోజులని.. వెయ్యి రోజులని కూడా పోస్టర్లు రెడీ అవుతున్నాయి. వీటి వెనుక మతలబేంటన్నది అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు జనాలకు ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఓకే కానీ.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు వందల సెంటర్లలో వంద రోజులాడే పరిస్థితులుండేవి. ఆ రోజుల్లో ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది అభిమానులకు తెలిసేది కాదు. పేపర్లో వచ్చే ప్రకటననే నమ్మేసేవాళ్లు. రికార్డుల గురించి సంబరాలు చేసుకునేవాళ్లు.

టాలీవుడ్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సింహాద్రి.. మగధీర సినిమాల రికార్డుల విషయంలోనూ కొంత కల్పన ఉందని అంటే ఆశ్చర్యపోవాల్సిందే. స్వయంగా ఈ చిత్రాల దర్శకుడు రాజమౌళే ఈ సంగతి వెల్లడించాడు. ఈ సినిమాల రికార్డులు ఫేక్ అన్న తరహాలో మాట్లాడాడు రాజమౌళి. ఈ విషయంలో తాను ఎంత ఇబ్బంది పడిందీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు జక్కన్న. అప్పట్లో సినిమాలు వంద రోజులు ఆడినా ఆడకపోయినా.. థియేటర్ల సంఖ్య పెంచేసి.. ప్రకటించేవారని.. ఇది అన్ని పెద్ద సినిమాలకూ మామూలే అని.. తనకు మాత్రం అది నాకు చాలా చిరాకుగా అనిపించేదని అన్నాడు రాజమౌళి. ‘సింహాద్రి’ సినిమా చాలా సెంటర్లలో వంద రోజులాడిందని.. అది జెన్యూన్ అని.. కానీ అక్కడితో ఆగకుండా 175 రోజుల సెంటర్ల విషయంలో రికార్డు కోసమని.. 15 సెంటర్లలోనే ఆడితే.. ఇంకో 15 సెంటర్లలో ఆడించారని వెల్లడించాడు రాజమౌళి. తన దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ విషయంలో ఇలా జరడకూడదని ముందే అల్లు అరవింద్ తో దీనిపై చర్చించానని.. ఆయన ఓకే అని చెప్పి ఆ తర్వాత మాట తప్పారని రాజమౌళి తెలిపాడు. అదేంటని అడిగితే అభిమానుల కోసం తప్పదని సర్ది చెప్పాడని.. కానీ అది నచ్చక తాను 100 రోజుల వేడుకకు కూడా రాలేదని రాజమౌళి వెల్లడించాడు. మొత్తానికి సింహాద్రి.. మగధీర సినిమాల రికార్డులు జెన్యూన్ కాదని చెప్పకనే చెప్పాడు జక్కన్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/