అభిమాని కోసం ఈ హీరో ఏం చేశాడో తెలుసా.?

Sun May 20 2018 17:31:53 GMT+0530 (IST)

తమిళనాట హీరోలను ప్రాణంగా ప్రేమిస్తారు.. వారికి గుడులు కడుతారు.. దేవుడిలా కొలుస్తారు.. ఆ పిచ్చి ప్రేమ అక్కడి అభిమానులకే కాదు.. హీరోలకు కూడా ఉంది. అభిమానుల కాళ్లు మొక్కి మొన్నీ మధ్యే నటుడు సూర్య అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా హీరో శింబు చేసిన ఈ పని చూస్తే మీరు శభాష్ అంటారు..తమిళ హీరో శింబు లక్షలాది అభిమానుల్లో మదన్ ఒకరు.. స్థానిక తేనాంపేట లోని ఒక ఏరియాలో నివశిస్తున్నాడు. ఇతను నగరంలోని ఒక నక్షత్ర హోటల్ లో పాటలు పాడుతుంటాడు. మదన్ కు నటుడు శింబు అంటే వల్లమాలిన అభిమానం.. ఆయన అభిమాన సంఘంలో నిర్వాహకుడిగా ఉన్నాడు.

గతవారం ఒక వివాహ వేడుక కోసం పోస్టర్ అంటిస్తుండగా ఆ ప్రాంతంలోని యువకులకు మదన్ కు మధ్య గొడవ అయ్యింది. అది చిలికి చిలికి గాలివానగా మారి.. మదన్ హత్యకు దారితీసింది. ఈ విషయం హీరో శింబు దృష్టికి వచ్చింది. శింబు తన తండ్రి టి. రాజేందర్ కు విషయం చెప్పి మదన్ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి చైన్నై తేనాంపేట ప్రాంతంలో శింబు తన అభిమానికి కన్నీటి నివాళి తెలిపారు. పోస్టర్ ను స్వయంగా అంటించారు. మదన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.  అభిమానులపై హీరోలకు ప్రేమాభిమానాలు ఉంటాయన్నది శింబు ఇలా నిరూపించాడు.