Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ప్రకాష్ రాజ్ మరో బ్రహ్మాస్త్రం

By:  Tupaki Desk   |   26 Oct 2016 6:02 AM GMT
టీజర్ టాక్: ప్రకాష్ రాజ్ మరో బ్రహ్మాస్త్రం
X
ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నట ప్రతిభను సమర్థంగా ఉపయోగించుకునే దర్శకులు కొద్దిమందే. కొన్నేళ్ల పాటు ఆయన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూసి చూసి జనాలకు విసుగొచ్చేసిన మాట వాస్తవం. అలాంటి టైంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో కొన్నేళ్ల కిందట ఆయన చేసిన ‘కాంజీవరం’ ప్రకాష్ రాజ్ ను సరికొత్తగా పరిచయం చేసింది. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా అందుకున్నాడాయన. మళ్లీ ఇప్పుడు ప్రకాష్ రాజ్-ప్రియదర్శన్ కాంబినేషన్లో మరో అద్భుతమైన సినిమా తయారైంది. అదే ‘సిల సమయంగలిల్’. ఇంకా రిలీజ్ కాకముందే అద్భుతం అని ఎలా అనేస్తున్నారు అన్న సందేహం రావచ్చు. ఆల్రెడీ ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్ సంపాదించింది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూసినా ఇది గొప్ప సినిమానే కావచ్చన్న అభిప్రాయం కలుగుతుంది.

సిల సమయంగలిల్.. ఎయిడ్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం విశేషం. ఓ ఆసుపత్రిలో ప్రకాష్ రాజ్ సహా ఐదారుగురు వ్యక్తులు తీవ్ర ఉత్కంఠ మధ్య ఎదురు చూస్తుంటారు. వాళ్లందరి బ్లడ్ శాంపిల్స్ పరీక్షలకు వెళ్లి ఉంటాయి. ముందు అందరూ లేని గాంభీర్యం.. అసహనం ప్రదర్శిస్తారు. నేను ఆ టెస్టు కోసమే వచ్చానని మీకు తెలుసా అని ఓ అమ్మాయి.. నేను ఫ్యామిలీ మ్యాన్ అండీ అంటూ మిడిల్ ఏజ్ లో ఉన్న ప్రకాష్ రాజ్.. ఇలా ఒక్కొక్కరుగా తమ అసహనాన్ని చూపిస్తుంటారు. కానీ కొంతసేపటి తర్వాత వాళ్లలోని అంతర్గత ఆవేదన బయటికి వస్తుంది. నాకేమైనా అయితే అంటూ ఒకరు.. ఇలా చేయాల్సింది కాదు అని ఇంకొకరు.. ఇలా వేదన చెందుతుంటారు. మొత్తంగా క్షణికావేశంలో తప్పు చేసి.. ఆ తర్వాత ఎంత క్షోభ అనుభవిస్తారో ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు ప్రియదర్శన్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.