Begin typing your search above and press return to search.

మహానటికి కోపం వచ్చింది ఒక్కసారే

By:  Tupaki Desk   |   17 May 2018 11:30 PM GMT
మహానటికి కోపం వచ్చింది ఒక్కసారే
X
సావిత్రి గారి బయోపిక్ గా మహానటి ఘన విజయం సాధించాక ఆవిడ జీవితం గురించి విశేషాలు తెలుసుకోవడానికి ఇప్పటి తరం ప్రయత్నించడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. యూత్ తో మొదలుకుని ముసలి వాళ్ళ దాకా వయసు భేదాలు లేకుండా అందరూ థియేటర్లకు రావడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడ తప్ప సావిత్రి గారికి కోపం వచ్చే అలవాటు ఉన్నట్టు నాగ అశ్విన్ ఎక్కడా చూపించలేదు. నిజానికి సావిత్రి గారిది చాలా జోవియల్ నేచర్. తన చుట్టూ ఉన్న వారితో సరదాగా ఉంటూ అందరితో నవ్వుతూ కాలం గడపటమే ఆవిడకు తెలిసింది. అలాంటి సావిత్రి గారికి ఒకేఒక్కసారి పట్టలేనంత కోపం వచ్చిందట. అది ఆవిడ భర్త జెమిని గణేషన్ అప్పట్లో జరిగిన ఒక పాత ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.

పాపమనిప్పు అనే సినిమా వంద రోజుల వేడుక కోసం సావిత్రి గారు జెమిని గణేషన్ ఇద్దరూ బెంగుళూరు చేరుకున్నారు. అక్కడి ప్రఖ్యాత వుడ్ లాండ్స్ హోటల్ లో మకాం. థియేటర్ కు వెళ్ళాక జెమినీ గారికి హోటల్ నుంచి ఫోన్ కాల్ టెలిగ్రామ్ వచ్చిందని. అదేంటో ఈయన చదవమన్నారు. అందులో సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి పోయారు అని ఉందట. దీంతో షాక్ తిన్న జెమిని గణేషన్ సావిత్రికి చెప్పకుండా వెంటనే హోటల్ రూమ్ కు చేరుకున్నారు. వెంటనే మెడ్రాస్ కు ఫోన్ చేసి అమ్మాయి క్షేమంగా ఉందని తెలుసుకుని నిట్టూర్చారు. మొదటి భార్య అలిమేలును ఫోన్ లో అడిగితే ఆ టెలిగ్రామ్ సంగతి తనకు తెలియదన్నారు.

వేడుక అయిపోయాక జెమిని గణేషన్ సావిత్రి కి జరిగినదంతా చెప్పారు. సావిత్రి గారి ఉగ్ర స్వరూపం మొదటి సారి జీవితంలో ఆయన చూసారు. కోపంతో ఊగిపోతూ విజయ గురించి ఇలాంటి వార్త ఇచ్చింది ఎవరూ అంటూ ఆరా తీసేందుకు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి ఈ పని ఎవరు చేసారో కనుక్కునేందుకు చాలా ప్రయత్నించారు. జెమిని గణేశన్ ఎంత ప్రయత్నించినా కోపం తగ్గలేదు. ఆ పని చేసింది ఎవరో మాత్రం తేలలేదు. ఇప్పటి లాగా టెక్నాలజీ అందుబాటులో ఉండి ఉంటే ఇది సులభం అయ్యేది కాని అప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమే. అదండీ సావిత్రి గారికి కోపం వచ్చిన ఒకే ఒక్క సందర్భం.